Telangana Liberation Day 2022 Live Updates: తెలంగాణ సమాజాన్ని చీల్చే కుట్ర, ఆ పరిస్థితులు మళ్లీ రావొద్దు - కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తెలంగాణ సమాజం బుద్ధి కుశలత ప్రదర్శించి స్వరాష్ట్రం సాధించుకుందని, అదే క్రియాశీలతతో వ్యవహరించి జాతి జీవ నాడి తెంచాలని చూస్తున్న వారిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం లోతులో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సును కాంక్షించే బాధ్యత గల వ్యక్తిగా చెబుతున్నానని, ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అశాంతి, అభద్రత, అలజడులతో అట్టుడికి పోవద్దని అన్నారు. జాతి నిర్మాణంలో తెలంగాణ ఉజ్వల పాత్ర నిర్వహించాలని పిలుపునిచ్చారు.
మతతత్వ శక్తులు బయలుదేరి తమ వికృత ప్రయత్నాలతో తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరుగుతున్న తెలంగాణ సమైక్య దిన వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. సమాజంలో తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను గ్రహించి అందరూ ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏ మాత్రం ఆదమరిచినా బాధాకరమైన సందర్భాలు ఎదురవుతాయని అన్నారు. ఒకసారి జరిగిన ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించామని అన్నారు. ఆ అస్తిత్వం నిలుపుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశామని, తెలంగాణ ఉద్యమం చేశారని అన్నారు. ఆ ఉద్యమ ఘర్షణను తలచుకుంటే తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. అలాంటి వేదన మళ్లీ ఎదురు కాకూడదని అన్నారు. సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది ముళ్ల కంపలు నాటుతున్నారని అన్నారు. విద్వేష మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మనుషుల మధ్య ఈ విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని అన్నారు.
తెలంగాణ విమోచన వేడుకల్లో వివిధ కళారూపాలను ప్రదర్శించారు. 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ప్రదర్శనలు ఇప్పించారు. ఈ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కాగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, కర్ణాటక రవాణా శాఖ మంత్రి బి.శ్రీరాములు కూడా హాజరయ్యారు.
పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి, అమర వీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. కేంద్రం నిర్వహిస్తున్న ఈ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బందోబస్తు కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు.
కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దిన వేడుకలు లైవ్ ఇక్కడ చూడండి
హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దిన వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్ కు చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నాయకులు అంతా హాజరయ్యారు.
Background
తెలుగు రాష్ట్రాల్లో రాగల రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుందని వెల్లడించారు. అదే జరిగితే 19, 20 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని, ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించాయి.
అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వాయువ్య మరియు ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద దాదాపు 2022 సెప్టెంబరు 18వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు.
నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన బిల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాలో..
దక్షిణ కోస్తాంధ్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో..
ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో వర్షాలు ఇలా (Telangana Weather)
నేడు (సెప్టెంబరు 17), రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు సంబంధించి హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. సెప్టెంబరు 19న కూడా తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు చాలా కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
20న భారీ వర్షాలు
భారీ వర్షాలు తెలంగాణలోని మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అక్కడ కురిసే అవకాశం ఉంది.
‘‘ఎటువంటి వర్షాలు లేక, పూర్తిగా ఎండ వాతావరణ పరిస్ధితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో వడగాల్పులు లాంటి వాతావరణం కొనసాగుతోంది. గత మూడు సంవత్సరాలకు భిన్నంగా ఈ సారి వర్షాలు తక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు మాత్రం ఎక్కువగా ఉంది. అత్యధికంగా నెల్లూరు, ప్రకాశం, ఎన్.టీ.ఆర్, తిరుపతి, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు కూడా ఇలాంటి వాతావరణం కొనసాగనుంది. సెప్టంబర్ 18 నుంచి అల్పపీడనం వలన ఉపశమనం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -