Breaking News Live Telugu Updates: బాలానగర్ లో దారుణం, ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 15 Nov 2022 09:38 PM
బాలానగర్ లో దారుణం, ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య 

మేడ్చల్ జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. నెలలు వయసున్న ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది.  గౌతమ్ నగర్ లో ఉన్న భర్తతో ఉంటున్న అనిత పెద్దకుమార్తె వర్షిణి(22 నెలలు), కుమారుడు శ్రీహాన్ (9నెలలు) వయస్సు గల చిన్నారులకు ఉరి వేసి తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

డేరింగ్‌గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కృష్ణ: చంద్రబాబు

సీనియర్ నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్‌ కృష్ణ భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం మహేశ్‌బాబును పరామర్శించి, ఆయన  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన ఆకస్మిక మరణం తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతో బాధించిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ ఓ లెజెండ్ అన్నారు. సినిమా పరిశ్రమలలో ఓ దిగ్గజం అని కొనియాడారు. సినీ పరిశ్రమలో 44 ఏళ్లు 350 సినిమాల్లో నటించడం చాలా గొప్ప విషయం అన్నారు. అప్పట్లోనే టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ అన్నారు. ఏదైనా చేయాలంటే, డేరింగ్ గా నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అన్నారు. 


నటుడిగా మాత్రమే కాదు సినిమా స్టూడియో నిర్మించి నిర్మాతగా, దర్శకుడిగా విశేషమైన సేవలు అందించారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ సినిమా తేనె మనుషులు సినిమా చూశానని, ఇప్పటికీ తనకు ఆ సందర్భం గుర్తుందన్నారు. తిరుపతిలో తొలిసారి కృష్ణను చూశానని, ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్నారని చెప్పారు. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా కృష్ణ తప్ప మరో హీరో తీయలేరన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు- ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో భారీ పేలుడు సంభవించింది. గౌరీపట్నంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు మహిధర్‌, రత్నబాబు, సత్యనారాయణగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.  

Konaseema District News: ‘జగనన్న ఇళ్లు - పేదల కన్నీళ్లు’ అనే నినాదంతో వినూత్న నిరసన

  • అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు సఖినేటిపల్లి (మం) కేశవదాసుపాలెంలో ‘జగనన్న ఇళ్లు - పేదల కన్నీళ్లు’ అనే నినాదంతో వినూత్న నిరసన తెలియ చేసిన జన సేన వీరమహిళలు.

  • జగనన్న ఇళ్ల కాలనీలో మోకాళ్ళ నీటిలో  నీటిలో నిలబడి తేలియాడే ఇల్లుతో వినూత్న నిరసన తెలియజేసిన జనసేన వీరమహిళలు

  • వైసీపీ నేతలు వేలల్లో కొని లక్షల్లో దండుకున్నారని ఆరోపించిన వీరమహిళలు

Telangana BJP News: ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు

తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాత వీరిని హస్తినకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Background

బంగాళాఖాతంలో ఈ నెల 16న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో నవంబర్‌ 18 నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే రెండు రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.


నెల్లూరులో భారీ వర్షాలు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం జలమయం అయింది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లే అవుట్‌లోని అండర్‌ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాగుంట లే అవుట్‌ అండర్‌ బ్రిడ్జిని బారికేడ్లు పెట్టి మూశారు. ఉమ్మారెడ్డి గుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. కావలి చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కుండపోత వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏటా ఈశాన్య రుతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రంలో అధికంగా వర్షాలు కురిసే సంగతి తెలిసిందే. ఈ రుతుపవనాల ప్రవేశించడంతో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. ఈ వర్షాల ప్రభావం తమిళనాడును ఆనుకొని ఉన్న ఏపీ ప్రాంతాల్లో కాస్త ఉంటోంది.


తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా..
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. నిన్న మాత్రం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30.8 డిగ్రీలు, 17.5 డిగ్రీలుగా నమోదైంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


తెలంగాణ, ఏపీలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 48,260 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 52,640 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 67,700 కు చేరింది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 48,260 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 52,640 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 67,700 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.