Breaking News Live Telugu Updates: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Oct 2022 02:31 PM
Wanaparthi News: కలెక్టర్ కార్యాలయంలో నాగుపాము కలకలం

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాగుపాము కలకలం సృష్టించింది. కలెక్టర్ కార్యాలయంలోని పదవ రూంలో నాగుపాము చూడడంతో ఒక్కసారిగా అధికారులు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే అధికారులు జిల్లా కేంద్రంలో గల స్నేక్ సొసైటీ  కృష్ణయ్య సాగర్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కృష్ణయ్య సాగర్ ఎంతో చాకచక్యంతో నాగుపామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరిగింది.ఏదేమైనా అధికారులు చూసుకోకుండా ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది.. చాక చక్యంగా పామును బంధించిన కృష్ణయ్య సాగర్ కు జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులు అభినందనలు తెలియజేశారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో స్పైస్ జెట్‌ విమానానికి తప్పిన ప్రమాదం

శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గోవా నుండి హైదరాబాద్‌కు వస్తున్న స్పైస్ జెట్ విమానంలో పొగలు వ్యాపించాయి. దీంతో విమానంలోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళన‌కు గురయ్యారు. అయితే పైలట్ ఎంతో చాకచక్యంగా విమానాన్ని శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Asifabad News: పెద్దవాగులో జోరుగా ఇసుక దందా

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెద్దవాగులో జోరుగా ఇసుకదందా కొనసాగుతోంది. ఇటివలే అందవెల్లి బ్రిడ్జి దగ్గర ఉన్న పిల్లర్ వద్ద ఇసుక తవ్వకాల వల్ల వంతెన కురుకుపోయింది. ప్రస్తుతం అందవెల్లి వంతెన ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు వంతెనపై నుండి రాకపోకలు నిలిపివేశారు. అయినప్పటికీ ఇసుక దొంగలు మాత్రం తమ పని తాము చేస్తునే ఉన్నారు. ఇసుక కోసం గుంపుగుంపులుగా పోటాపోటిగా ట్రాక్టర్లు వెలుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారులు ఈ తతంగంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలా జరుగుతున్నట్లు ప్రజల్లో చర్చ జరుగుతుంది.

Supreme Verdict On Hijab: హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులు

కర్ణాటక హిజాబ్​ వివాదంపై సుప్రీం కోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. హిజాబ్​పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ప్రతిపాదించారు.


మరోవైపు జస్టిస్ సుధాన్షు ధూలియా ఇందుకు భిన్నంగా తీర్పు రాశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ హిజాబ్ బ్యాన్​పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది కేవలం ఛాయిస్ మాత్రమేనని, అంతకంటే ఎక్కువ లేదా తక్కువ కాదని జస్టిస్ సుధాన్షు ధూలియా అన్నారు.

Hyderabad లో భారీ ట్రాఫిక్‌ జాం, సుచిత్ర - కోంపల్లి మధ్య నిలిచిన వాహనాలు

హైదరాబాద్‌ శివార్లలోని సుచిత్ర - కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి బాగా కురవడంతో కొంపల్లి - దూలపల్లి మార్గంలో రోడ్డు కోతకుగురైంది. దీంతో వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. మేడ్చల్‌ వైపు వెళ్లే వాహనాలు సుచిత్ర వద్దే ఆగిపోతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను మరోదారిలో మళ్లిస్తున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి చెరువు నిండిపోయింది. చెరువు అలుగుపోస్తుండటంలో రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుంది.

Background

Telangana, AP Weather News: తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కరవు సీమ అయిన అనంతపురం వరదల్లో చిక్కుకోగా, మిగతా ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ బుధవారం (అక్టోబరు 12) రాత్రి వరుణుడు ప్రతాపం చూపాడు. ఈ నెల 15 వరకూ (మరో రెండు రోజులు) తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


ప్రస్తుత వాతావరణ పరిస్థితి
ఉపరితల ద్రోణి ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి మరాఠ్వాడా, విదర్భ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు కొనసాగుతోందని వాతావరణ అధికారులు తెలిపారు. దీనికితోడు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని చెప్పారు. దీనికి తోడు ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఏర్పడితే మరింత బలపడి రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురుస్తాయని భావిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


గడిచిన 24 గంటల్లో అనంతపురం, అన్నమయ్య, పల్నాడు, చిత్తూరు, సత్యసాయి, అనకాపల్లి, పల్నాడు, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురిశాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో ప్రజలు వరదలు ఎదుర్కొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కసిపాడులో బుధవారం అత్యధికంగా 12.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 24 గంటల్లోఅనంతపురంలో 6.2, తంబళ్లపల్లెలో 5.7,రాప్తాడు, కూడేరుల్లో 6.4, కె.కోటపాడులో 6.3, కుట్టగుళ్లలో 5.4,  పుంగనూరులో 6.9 సెంటీమీటర్లు, రాజాంలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


Telangana Weather: తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు.. మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిరిసిల్ల వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఈ ఉదయం వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురిసే అవకాశం ఉంది. 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేశారు. 


గత రాత్రి వర్ష బీభత్సం
ఇప్పటికే హైద‌రాబాద్‌లో గత రాత్రి చాలాచోట్ల భారీ వ‌ర్షం కురిసింది. రోడ్లపైకి భారీగా వరద చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరువైపులా కిలో మీటర్‌ మేర వాహనాలు ఆగిపోయాయి. బోరబండలో అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలోకి వరద నీరు చేరింది. బోరబండలో వరద ప్రవాహంలో ఆటోలు, బైక్ లు కూడా కొట్టుకుపోయాయి. ఇళ్ల ముందు పార్క్‌ చేసిన వాహనాలు కొట్టుకుపోయేలా వరద వచ్చింది. రహమత్ నగర్, బోరబండలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రసూల్‌పురాలో ఇళ్లలోకి నీరు చేరింది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.