Breaking News Live Telugu Updates: ప్రాథమిక సభ్యత్వం ఆశించే బీజేపీలో చేరా - కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 12 Apr 2023 02:43 PM
Kiran Kumar Reddy: ప్రాథమిక సభ్యత్వం ఆశించే బీజేపీలో చేరా - కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో డెవలప్ మెంట్ జరుగుతోందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీలో ఓ ముఖ్య నాయకుడు తనను సంప్రదించారని, ఆ తర్వాత బీజేపీలో చేరానని అన్నారు. తాను కేవలం బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం ఆశించి మాత్రమే పార్టీలో చేరానని చెప్పారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి, అక్కడే పెరిగి, హెచ్‌పీఎస్, నిజాం కాలేజీల్లో చదువుకున్నానని, సొంతఊరు ఏపీలోని చిత్తూరు అని అన్నారు. తనకు బెంగళూరులో కూడా ఇల్లు ఉందని అన్నారు. అలాంటప్పుడు పార్టీ అవసరాన్ని బట్టి, ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేస్తానని చెప్పారు. 

Harish Rao: తెలంగాణ-ఏపీ మంత్రుల మధ్య వార్! ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన హరీశ్ రావు

ఏపీ మంత్రుల మధ్య వార్ మొదలయింది. తెలంగాణ మంత్రి హరీశ్ రావు నిన్న తొలుత చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి స్పందించగా, ఇప్పుడు హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఏమున్నదని అనొద్దని హితవుపలికారు. ఏమున్నాయో చెప్పాలంటే సమయం సరిపోదని, ఏపీ మంత్రులు మా జోలికొస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. కనీసం ఆంధ్రాకు ప్రత్యేక హోదా కూడా అడగలేని స్థితిలో అక్కడి ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఉన్నాయని అన్నారు. 2019కి ముందు ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేస్తే, ఇప్పుడు అదే ఎన్డీఏతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు.

Balineni Srinivasula Reddy: బాలినేని అలక, జగన్ సభకు వచ్చి వెనక్కి వెళ్లిపోయిన శ్రీనివాసులరెడ్డి

జగనన్న ఈబీసీ నేస్తం నిధుల విడుదల కోసం ఈరోజు సీఎం జగన్ ప్రకాశం జిల్లా మార్కాపురం వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డికి అవమానం జరిగినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ఆయన్ను ఆహ్వానించే క్రమంలో బాలినేనిని పోలీసులు అడ్డుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు వచ్చే నేతల జాబితాలో బాలినేని పేరు లేకపోవడంతో ఆయన్ను లోనికి అనుమతించలేదు పోలీసులు. దీంతో ఆయన అలిగారు. వెంటనే కారు వెనక్కు తిప్పించి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈబీసీ నేస్తం సభ ప్రారంభమైనా బాలినేని అందుకే సభా ప్రాంగణంలోకి రాలేదని తెలుస్తోంది. స్టేజ్ పై కూడా బాలినేని లేకుండానే కార్యక్రమం మొదలైంది. ఈ విషయంలో వైసీపీనుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్ లేదు. అటు బాలినేని కూడా మీడియా ముందు అసహనం వ్యక్తం చేయకుండా సైలెంట్ గా తిరిగి వెళ్లిపోయారు. జిల్లా నేతలతోపాటు మంత్రులు.. సీఎం జగన్ తో కలసి ఆ మీటింగ్ లో పాల్గొన్నారు. వేదికపై కంప్యూటర్ బటన్ నొక్కి.. ఈబీసీ వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేస్తారు జగన్. ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఓసీ వర్గాల పేద మహిళలకు ప్రతి ఏటా 15 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తోంది ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది కూడా నిధులు విడుదల చేస్తున్నారు జగన్.

Janareddy News: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అస్వస్థత

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు తెలిసింది. 

Disha Case Encounter: దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై నేడు హైకోర్టులో విచారణ

  • దిశా కేసు ఎన్ కౌంటర్‌పై సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికపై నేడు హైకోర్టు విచారణ

  • కమిషన్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని పలు పిటిషన్లు

  • ఈరోజు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీం కోర్టు నుండి రానున్న సీనియర్ న్యాయవాది 

  • ఈ కేస్ లో ముగిసిన ఆరుగురు ఇంప్లీడ్ పిటిషనర్ల వాదనలు

Background

తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రస్తుతం దిగువ స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తదుపరి మూడు రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు  సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ రేపటి నుండి  40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 42 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (Andhra Pradesh State Disaster Management Authority-APSDMA) మంగళవారం 32 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


అల్లూరి సీతారామరాజు జిల్లా ఏడు మండలాల్లో విపరీతమైన వేడిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత కనిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి జిల్లాలోని ఐదు మండలాలు, తూర్పుగోదావరిలోని రెండు మండలాలు, కాకినాడలోని ఆరు మండలాలు, పార్వతీపురం జిల్లాలోని ఆరు మండలాల్లో కూడా వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేశారు.


ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు - ఐఎండీ
 ఈ ఏడాది వ‌ర్షాకాలం సాధార‌ణంగా ఉండ‌నుందని, నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్ల వ‌ర్షాలు సాధార‌ణంగా ఉంటాయ‌ని మంగళవారం భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ డాక్టర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. వ‌ర్షాకాలం మ‌ధ్యలో ఎల్ నినో ప‌రిస్థితులు ఉత్పన్నం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దాని వ‌ల్ల రుతుప‌వ‌నాల‌పై ప్రభావం ప‌డుతుంద‌ని, సీజ‌న్ రెండో భాగంలో వ‌ర్షాలు త‌క్కువ‌గా కురిసే అవ‌కాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. 2023లో జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 96 శాతం వ‌ర్షపాతం ఉంటుంద‌ని ఐఎండీ చెప్పింది. జూలైలో ఎల్ నినో ప‌రిస్థితులు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.


ఎల్ నినో వ‌ల్ల ప‌సిఫిక్‌ స‌ముద్ర ఉప‌రిత‌లం వేడిగా మారుతుంది. దీని వ‌ల్ల ప్రపంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణాల్లో మార్పు సంభ‌విస్తుంది. ఇండియాపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఒక‌వేళ నైరుతి రుతుప‌వ‌నాల స‌మ‌యంలో ఎల్‌నినో ఉంటే, అప్పుడు వ‌ర్షాలపై ప్రభావం ప‌డే అవకాశం ఉంది. దీని వ‌ల్ల రైతుల‌కు మ‌రిన్ని క‌ష్టాలు ఉంటాయి. ఎల్‌నినో వ‌ల్ల సాధార‌ణంగా భారత్ లో వ‌ర్షపాతం త‌క్కువ‌గా న‌మోదు అవుతుంది. దీంతో క‌రవు ప‌రిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.