Breaking News Live Telugu Updates: మంత్రులతో నేడు కేసీఆర్ సమావేశం - చర్చించే అంశాలివే

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Jun 2022 11:21 AM
CM KCR: మంత్రులతో నేడు కేసీఆర్ సమావేశం - చర్చించే అంశాలివే

సీఎం కేసీఆర్‌ నేడు మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్‌ లీడర్లు కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Warangal: వరంగల్‌లో 280 కిలోల పటిక స్వాధీనం

వరంగల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ మహిళ నుంచి 280 కిలోల పటికను గురువారం అధికారులు పట్టుకున్నారు. శివనగర్‌ సైకిల్‌ స్టాండ్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఖిలావరంగల్‌ మండలం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌, స్పెషల్‌ ట్రైన్‌ చెకింగ్‌ టీమ్‌ అధికారులు వరంగల్‌ రైల్వేస్టేషన్‌ శివనగర్‌ సైకిల్‌ స్టాండ్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ మహిళ నుంచి 280 కిలోల పటిక పట్టుకున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. నెక్కొండ మండలం, కోసకంచతండాకు చెందిన భూక్య రమను అదుపులోకి తీసుకున్నారు. పటికను సీజ్‌ చేశామని తెలిపారు.

Mangalagiri Anna Canteen: మంగళగిరిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు 

  • మంగళగిరిలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు. 

  • నిన్న టీడీపీ ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ని తొలగించిన మున్సిపల్ సిబ్బంది.

  • తొలగించిన చోటే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు మరోసారి ప్రయత్నిస్తున్న టీడీపీ నాయకులు.

  • ఈరోజు మంగళగిరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు రూ.2 భోజనం పెడతామంటున్న టీడీపీ నేతలు.

  • ఎన్టీఆర్ విగ్రహం దగ్గర భారీగా మోహరించిన పోలీసులు

  • అన్నా క్యాంటీన్ ఏర్పాటుకి అంగీకరించేది లేదన్న మున్సిపల్ సిబ్బంది

  • అన్న క్యాంటీన్ ఏర్పాటుకి అడ్డు తగిలితే భారీగా ఉద్యమించాలని టీడీపీ నిర్ణయం

  • త్వరలోనే లక్ష మందితో అన్న క్యాంటీన్ - ఛలో మంగళగిరి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం

Tamilisai Women Darbar: నేడు తెలంగాణ రాజ్ భవన్‌లో మహిళా దర్బార్

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ నేడు రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాజ్‌భవన్ బయట ఫిర్యాదుల బాక్సు ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహిళా దర్బార్ కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిళలతో ఈ కార్యక్రమంలో గవర్నర్‌ పాల్గొననున్నారు. మహిళలు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న అంశాలు, భద్రతపై చర్చించనున్నారు.

Bandi Sanjay House Arrest: బండి సంజయ్ హౌస్ అరెస్టు - ఇంటి చుట్టూ పోలీసుల బందోబస్తు

బండి సంజయ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై ఆందోళనలకు ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగా సంజయ్ జేబీఎస్‌లో ప్రయాణికులతో ముఖాముఖి నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో బండి సంజయ్ జేబీఎస్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసుల యత్నించారు. బస్ ఛార్జీల పెంపుపై ధర్నాలు చేసి తీరుతామన్న బీజేపీ నేతలు చెబుతున్నారు. ఛార్జీల పెంపుపై నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజల బాధలు తెలుసుకోవడం నేరమా?, ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు.. అరెస్టులు, అణిచివేతలతో ఉద్యమాలను ఆపలేరు అంటూ పోలీసులపై బండి సంజయ్ అసహనం వ్యక్తం చేశారు.

Background

వచ్చే రెండ్రోజుల్లో రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే పరిస్థితులు కనిపిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ కేంద్రం అధికారులు తాజాగా వెల్లడించిన సమాచారం మేరకు.. ‘‘వచ్చే 48 గంటల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, దక్షిన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన భాగాలు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. 


తర్వాతి 2 రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాలు, మొత్తం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.’’ అని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల జూన్ 10న ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కొన్ని చోట్ల వీచే అవకాశం ఉంది. వచ్చే 3 రోజులు ఇలాంటి పరిస్థితే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


Telangana Weather Update
ఇక తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో వాతావరణ వివరాలు ఇలా ఉండనున్నాయి. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాుల అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితే మరో 3 రోజులు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


‘‘హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీల సెల్సియస్, 26 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు (గాలుల వేగం గంటకు 10 నుంచి 15 కిలో మీటర్లు) వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉంది.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు పెరిగింది. నేడు గ్రాముకు రూ.25 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,310 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.68,000 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,000 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,950 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,310గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,000 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.