Breaking News Live Telugu Updates: తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం, బాణాసంచా గోడౌన్ లో పేలుడు 4 మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 10 Nov 2022 09:00 PM
తాడేపల్లిగూడెం బాణాసంచా గోడౌన్ లో పేలుడు, నలుగురు మృతి

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడియద్దలో బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నాయి.  

విశాఖలో ప్రధాని మోదీతో భేటీకానున్న పవన్ కల్యాణ్  

ప్రధాని మోదీ రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు. వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఏపీలో పరిస్థితులు, తాజా రాజకీయాలపై ఇరువురు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. విశాఖలో బీజేపీ నిర్వహించే ర్యాలీలో పవన్‌ పాల్గొంటారా? లేదా? అనే విషయంపై ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ పర్యటనకు బీజేపీ, వైసీపీ పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తుంది. 

Sajjala Ramakrishna Reddy: లిక్కర్  స్కామ్ అరెస్ట్‌లపై సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందన

  • లిక్కర్  స్కామ్ అరెస్ట్‌లపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందన

  • విజయసాయి రెడ్డికి ఒకటే కూతురు. అరెస్టు అయ్యింది ఆయన అల్లుడు కాదు.. అల్లుడు అన్న..

  • అరబిందో అనేది పెద్ద వ్యాపార సంస్థ

  • వేల కోట్ల టర్నోవర్ ఉన్న అంతర్జాతీయ వ్యాపార సంస్థ

  • విజయసాయిరెడ్డి వాళ్ళకి బంధువే కానీ.. వాళ్ళ వ్యాపార సంస్థకు ఈయనకు సంబంధం ఏంటి?

  • ఈ వ్యవహారంలో డిల్లీ, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చాలా కాలంగా పొలిటికల్ వార్ జరుగుతుంది.

  • దానికి ఏపీ ప్రభుత్వానికి, వైసీపీకి, విజయసాయి రెడ్డి, జగన్ లకు ఏమిటి సంబంధం?

  • వేమన యూనివర్సిటీలో వేమన విగ్రహాన్ని మరింత ప్రముఖమైన స్థానంలో పెట్టారు.

Palnadu District: పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్‌లో ఉద్రిక్తత

  • పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో కోడెల శివరాం వైవీ ఆంజనేయులు వర్గాల మధ్య ఘర్షణ

  • కుర్చీలతో కొట్టుకున్న ఇరువర్గాలు

  • రసాభాసగా మారిన పార్టీ సంస్థాగత నియామకాలు

  • కొనసాగుతున్న ఉత్కంఠ

  • వేరే నియోజకవర్గ టీడీపీ నాయకులు వచ్చారని కోడెల వర్గం ఆరోపణ

  • కోడెల శివరామ్, జీవీ ఆంజనేయులు మధ్య మాటలు

  • ఎన్టీఆర్ భవన్ లో కోనసాగుతున్న ఉద్రిక్తత

  • కమిటీ మీటింగ్ నుంచి వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు

MLAs Buying Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్ కస్టడీకి ముగ్గురు నిందితులు

  • ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీస్ కస్టడీకి ముగ్గురు నిందితులు

  • రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలను ఐదు రోజుల కస్టడీ కోరిన పోలీసులు

  • రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చిన ఏసీబీ కోర్ట్ 

  • హై సెన్సిటివ్ కేస్ కావడంతో భిన్న కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టును కోరిన పోలీసులు

  • ప్రభుత్వం సిట్ సైతం ఏర్పాటు చేసిందని ఈ సమయంలో నిందితుల కస్టడీ అవసరం అని కోర్టును కోరిన పోలీసులు

  • చంచల్ గూడ జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను మరికొద్ది సేపటిలో కస్టడీకి తీసుకోనున్న మొయినాబాద్ పోలీసులు

Kusukuntla Prabhakar Reddy: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నికల్లో మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన సభ్యుడు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత శాసనసభలో సభ్యుడిగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ భవనంలోని సభాపతి ఛాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ & ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ధిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, MP లు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పోరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును ఈ సందర్భంగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్పీకర్ అందించారు.

Kasani Gnaneshwar: ఎన్టీఆర్ ఘాట్ వద్ద కాసాని జ్ఞానేశ్వర్ నివాళులు

తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కాసాని జ్ఞానేశ్వర్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద నందమూరి తారక రామారావుకి నివాళులు అర్పించి అనంతరం గన్ పార్క్‌కు చేరుకొని అమరవీరుల స్థూపానికి ఘనంగా నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసానికి జూబ్లీహిల్స్ బయలుదేరారు.

TTD News: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురి ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద, త్రిపుర మంత్రి రాంప్రసాద్ పాల్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందేజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల ద్వారా ప్రజలు సీఎం కెసిఆర్ వెంటనే ఉన్నామని తీర్పునిచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.  బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించాలని ప్రార్థించానన్నారు. ఓడిన వాళ్ళు గెలిచినా వారిపై ఆరోపణలు చేయడం సహజమేనని అన్నారు.  ప్రజా తీర్పును గౌరవించి ముందుకు సాగితేనే  రాజకీయాల్లో హుందాగా సాగుతాయని తెలిపారు. బీజేపీ దేశంలో ఉన్న ఇతర పార్టీల సీఎంలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. సమర్థవంతమైన నేత కేసీఆర్ మాత్రమే బీజేపీని ఎదుర్కోగలరని పేర్కొన్నారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని చెప్పిన ఆయన మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో జెట్టీ చిత్ర టీమ్

తిరుమల శ్రీవారిని జెట్టి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో జెట్టి మూవీ కధానాయకుడు కృష్ణ, దర్శకుడు సుబ్రహ్మణ్యం పిచ్చుకలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం‌ వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Mahabubabad: అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం రోటి బండ తండాలో బానోత్ రాము (40) అనే రైతు అప్పుల బాధ తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన్ను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న బానోత్ రాము  రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.

Rajendra Nagar: రాజేంద్ర నగర్ పీఎస్‌కు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులు

మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తును సిట్ (ప్రత్యేక దర్యాప్తు టీమ్) కు అప్పగిస్తూ దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సమక్షంలో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో విచారణ చేపట్టనున్నారు. నిందితులైన రామచంద్రబారతి, సింహయాజి, నందకుమార్ లను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

Background

బంగాళాఖాతంలోని నైరుతి భాగంలో నిన్న (నవంబరు 9) ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతూ ఉంది. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఇది ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. అయితే, ఇది ఏర్పడ్డ 48 గంటల్లో (నవంబరు 11 నాటికి) అల్ప పీడనంగా మారనుందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని, తమిళనాడు - పుదుచ్చేరి తీరాల వైపు వస్తుందని అంచనా వేశారు. అయితే, దీని ప్రభావం తమిళనాడుపై అధికంగా ఉండగా ఏపీలో కాస్త తక్కువగా ఉండనుందని అధికారులు చెప్పారు. 


దక్షిణ కోస్తాంధ్రకు వర్ష సూచన
ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శుక్రవారం (నవంబరు 11), శనివారం రెండు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


ముఖ్య నగరాలైన వైజాగ్, విజయవాడలో అల్పపీడనం అంతగా ప్రభావం చూపకపోవచ్చు. నవంబర్ 12 నుంచి 15 తేదీల్లో ఈ ప్రాంతాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈశాన్య రుతుపవనాలు ఏపీలో పూర్తి స్థాయిలో విస్తరిస్తున్నాయి. నేడు ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వాతావరణం పొడిగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.


నవంబర్ 12 నుంచి అల్పపీడనం ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలతోపాటుగా కడప, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల మీదుగా ఉండనుంది. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 13న వర్షాలు కురవనున్నాయి.


దక్షిణ కోస్తాంధ్ర - తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టుప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు కింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.


తెలంగాణలో పరిస్థితి ఇలా..
హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎక్కడా వర్ష సూచన లేదు. వచ్చే 3 రోజులు ఇలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 


హైదరాబాద్ లో ఇలా..
‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 15 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశల నుంచి గాలులు మూడు నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. నిన్న మాత్రం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 29.6 డిగ్రీలు, 15.5 డిగ్రీలుగా నమోదైంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.