Breaking News Live Telugu Updates: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్-ఇంగ్లాండ్ హాకీ మ్యాచ్ డ్రా

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 01 Aug 2022 10:19 PM
కామన్వెల్త్ గేమ్స్ లో భారత్-ఇంగ్లాండ్ హాకీ మ్యాచ్ డ్రా

కామన్వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ ను డ్రాగా ముగించింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు ఖాయం అనుకున్న సమయంలో ఇంగ్లాండ్ పుంజుకుని మ్యాచ్ డ్రా చేసింది. నిమిషాల వ్యవధిలో గోల్స్ సాధించిన ఇంగ్లాండ్ 4-4తో స్కోర్స్ సమంచేసింది. భారత్ తొలి మ్యాచ్ లో ఘనా పై 11-0తో ఘన విజయం సాధించింది. 

ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జబల్‌పుర్ న్యూలైఫ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

NTR Daughter Death: ఎన్టీఆర్ నాలుగో కుమార్తె హఠాన్మరణం

ప్రఖాత సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి హఠాన్మరణం చెందారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. కంఠమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్‌కు నాలుగో కుమార్తె. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Kakinada News: కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యా సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మహాధర్నా

తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాకినాడలో విద్యార్థులు కదం తొక్కారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా చేపట్టారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని నినాదాలు చేశారు. సుందరయ్య భవన్ నుంచి ధర్నా చౌక్ వరకు ప్రదర్శన చేసిన విద్యార్థులు పెండింగ్ లో ఉన్న పాఠ్య పుస్తకాలను వెంటనే అందించాలని, పిల్లల చదువును దూరం చేసే జీవో నెంబర్ 117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూల్లోకి మ్యాపింగ్ చేయవద్దని, పాఠశాలల విలీనాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని, బైజుస్ ఒప్పందం రద్దు చేయాలని కోరారు. దళిత, గిరిజన, బడుగుల పిల్లల చదువులకు దూరం చేసే విధానాలను వెనక్కి తీసుకోవాలని, విద్యా దీవెన వసతి దీవెన అందరికీ సక్రమంగా అమలు చేయాలని తదితర డిమాండ్లతో విద్యార్థులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

సస్పెన్షన్ ఎత్తివేత

విపక్ష సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు లోక్‌సభ స్పీకర్. నలుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించారు.

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టిన నిమ్స్ ఉద్యోగులు

  • నిమ్స్ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టిన నిమ్స్ ఉద్యోగులు

  • జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులు

  • అడ్మినిస్ట్రేషన్ స్టాప్ ధర్నాతో ఓపి సేవలకు ఆటంకం

  • ఓపి టోకెన్లు ఇచ్చే వారు లేకపోవటంతో రోగుల ఇబ్బందులు

  • నిమ్స్ లో ఓపి కౌంటర్ల వద్ద భారీగా క్యూలు

  • ఇబ్బంది పడుతున్న ఓపీ రోగులు

Chikoti Praveen News: ఈడీ అధికారుల ఎదుట చీకోటి ప్రవీణ్

  • ఈడీ విచారణకు హాజరైన చికోటి ప్రవీణ్, మాధవ రెడ్డి

  • విదేశాల్లో క్యాసినోపై ప్రశ్నించనున్న ఈడీ

  • ఇద్దరు నిర్వహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు నోటీసులు

  • ప్రవీణ్, మాధవరెడ్డి లను ఇప్పటికే 20 గంటల పాటు విచారించిన ఈడీ..

  • సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ లు బెట్టింగ్, హవాలాలో కీలకపాత్ర అని అనుమానిస్తున్న ఈడీ

  • చికోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం సేకరించిన ఈడీ 

  • చికోటి ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేసిన ఈడీ

  • చికోటికి చెందిన 4 బ్యాంకు అకౌంట్ల గుర్తింపు

Background

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో నేడు సైతం వర్షాలు కురుస్తాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన భారత వాతావరణ కేంద్రం ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వీటి ప్రభావంతో ఏపీలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు కురవనుడగా, తెలంగాణలో ఆగస్టు 5 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. కొన్ని దక్షిణ కోస్తాంధ్రకు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు.


తెలంగాణలో భారీ వర్షాలు 
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆగస్టు 5 వరకు వర్ష సూచన ఉంది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. హైదరాబాద్‌లో తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. నాగర్ కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని అప్రమత్తం చేస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంపై అధిక ప్రభావం చూపుతోంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రలో ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే రాయలసీమకు భారీ వర్ష సూచన ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తేలికపాటి జల్లులు పడతాయి. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.


హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.