Breaking News: ముగిసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. విందు అనంతరం తాజ్ హోటల్ నుంచి ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగస్వామి, తమిళనాడు మంత్రి పొన్నుమూడి, కేరళ మంత్రులు, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ తిరుగుపయమయ్యారు. ఈ రాత్రికి తిరుపతిలోని తాజ్ హోటల్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బసచేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాజ్ హోటల్ లో ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అవ్వనున్నారు. ఏపీలో పార్టీ బలోపేతంపై జాతీయ నాయకులతో అమిత్ షా చర్చించనున్నారు.
రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి రాజ్ హోటల్ వేదికగా ఏపీ రాష్ట్ర బీజేపీ నాయకులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. సోమువీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, సునీల్ ధియోదర్, విష్ణు వర్ధన్ రెడ్డి పలువురు ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అంబర్ పేట్ లో ఆర్టీసీ డ్రైవర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కకు ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ సీహెచ్ శ్రీనివాస్ ను తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి తరలించారు.
తిరుపతి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజ్ హోటల్ కు చేరుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, పుదుచ్చేరి సీఎం రంగసామి, తెలంగాణ, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ డి.కే.జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ పటేల్, తమిళ నాడు, కేరళ నుంచి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. మరికొద్ది సేపటిలో కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బంజారా ఉత్సవ్ 2021 ప్రారంభం అయింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ నేతలు రవీంద్రనాయక్, పేరాల శేఖరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టోరీ గోర్ పేరుతో బంజారా భాషా రేడియోను గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం బంజారా మహిళలతో కలసి దత్తాత్రేయ నృత్యం చేశారు. మరికాసేపట్లో బంజారా ఉత్సవ్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరు అవుతారు. ఏటా ఇదే గ్రౌండ్స్‌లో నుమాయిష్ జరిగే సంగతి తెలిసిందే.
వరి ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు, ఎల్లుండి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న ఆయన రాత్రి సూర్యపేటలో బస చేయనున్నారు. నవంబర్ 16న తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో పర్యటించి మార్కెట్ లో ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులు, కనీస మద్దతు ధర రాక రైతులు పడుతున్న కష్టాలను పరిశీలించనున్నారు.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగకుండా ఆగిపోయిన 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది. మొత్తం 1.32 లక్షల మంది తమ ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.
చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పాతపేట మునిస్వామిపురంలో అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేయగా పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికేతరులు తమ ఏరియాకు వచ్చి డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణుల ఆరోపిస్తున్నాయి.
రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీ ఛైర్మన్ పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టుల పరిశీలనకు జీఆర్‌ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్సింగూరు వెళ్లారు. నిజాంసాగర్, అలీసాగర్‌ను వీరి బృందం పరిశీలించనుంది. ఎస్‌ఆర్‌ఎస్పీ, చౌటుపల్లి హన్మంతురెడ్డి, గుత్ప ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్నారు. ఇవాళ, రేపు ప్రాజెక్టులను జీఆర్‌ఎంబీ ఛైర్మన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. రేపు ఎస్‌ఆర్‌ఎస్పీ వద్ద చీఫ్ ఇంజినీర్లతో జీఆర్‌ఎంబీ ఛైర్మన్ సమావేశం అవుతారు.
కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన గౌతమి అనే 23 ఏళ్ల యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గౌతమికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. ఈ పెళ్లి ఇష్టంలేని గౌతమి బావ తరచూ ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ క్రమంలో మనస్తాపంతో గౌతమి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తుమ్మితే ఆ తుంపిర్లలో బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకుపోతాయని అన్నారు. పిచ్చి కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉద్యమ గొంతులను కేంద్రం అణగదొక్కాలని చూస్తోందని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో 24 మందికి గాయాలయ్యాయి. పెద్దపల్లి - కరీంనగర్ ప్రధాన రహదారిపై మంథని ప్లై ఓవర్ వద్ద ఘటన జరిగింది. మంచిర్యాల నుండి కరీంనగర్ కు వెలుతున్న TS19Z 0020 ఆర్టీసీ బస్సు, మంథని మూల వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
36 సర్పంచి స్థానాలకు ఎన్నికలతో పాటు వార్డు సభ్యుల ఎన్నిక కోసం నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకాగా, మధ్యాహ్నం ఒకటి వరకు జరుగుతుంది. పోలింగ్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై ఎస్ఈసీ నీలం సాహ్నిశనివారం సమీక్షించారు. 69 సర్పంచి స్థానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తే అందులో 30 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 3 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 533 వార్డు సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ రాగా అందులో 380 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 85 చోట్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రేపు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై కూడా చర్చించారు.
విశాఖపట్నం జిల్లాలో భూప్రకంపనలు సంభవించాయి. విశాఖ నగరంలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. బాలయ్య శాస్త్రి లే అవుట్, సీతమ్మధార,అల్లిపురం బంగారమ్మ మెట్ట, వేపగుంట పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు రావడంతో విశాఖ నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బీచ్ రోడ్డు, కంచరపాలెం, మధురానగర్, అక్కయ్యపాలెం, మురళీనగర్, తాడిచెట్లపాలెం ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. పెందుర్తి, సింహాచలంలో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూమి కంపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సాధారణ భూప్రకంపనలే అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
Background
ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది దక్షిణ అండమాన్ తీరంలో శనివారం మొదలైంది. నవంబర్ 15 నాటికి ఇది తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా అల్పపీడనం తుపానుగా మారనుందని, దీని ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై అధికంగా ఉంటుంది. ఈ వాయుగుండం తుపానుగా మారనుందని, దీనికి జవాద్ అని నామకరణం చేయాలని నిర్ణయించారు.
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడు తాజా వాయుగుండం జవాద్ తుపానుగా మారనుండటంతో ఏపీ, తమిళనాడులకు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. తమిళనాడుతో పాటు కొస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం బలపడి నవంబర్ 18 నాటికి ఏపీ తీరానికి చేరే అవకాశం ఉంది. జవాద్ ప్రభావంతో ఏపీలో మరో మూడు, నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణపై సైతం తాజా అల్పపీడన ప్రభావం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోరూ చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా ముందు రోజుతో పోల్చితే నిలకడగానే ఉంది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. దీంతో తాజా ధర రూ.107.69 గా కొనసాగుతోంది. డీజిల్ ధర కూడా రూ.94.14గా నిలకడగా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు భారీగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.20 పెరగ్గా.. వెండి ధర గ్రాముకు రూ.0.30 పైసలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.300 ఎగబాకినట్లయింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో గ్రాముకు రూ.20 పెరిగి.. రూ.46,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,180 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,100 కు ఎగబాకింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,700గా ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,180గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.71,700 గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -