Breaking News:   తిరుమలలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

నేడు ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాల అప్ డేట్స్ ఇక్కడ అందిస్తున్నాం.

ABP Desam Last Updated: 06 Nov 2021 05:06 PM
ఆంధ్రాను అదానీ రాష్ట్రంగా మార్చేస్తున్నారు : పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా మారుస్తున్నారని  ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో గోల్ మాల్ జరుగుతుందని, అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 


 

తిరుమలలో నవంబరు 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

నవంబ‌రు 12, 13 14వ తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ తెలిపింది. తిరుప‌తిలో నవంబరు 14వ తేదీన ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌మావేశం ఉన్న కారణంగా నవంబరు 13, 14, 15వ తేదీల్లో తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో బ్రేక్ ద‌ర్శనాల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించాలని విజ్ఞప్తి చేసింది.


 

వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని శనివారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వీరితో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన రెడ్డి, కొత్తపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కోనసీమ ముఖ ద్వారం, వాణిజ్య కేంద్రమైన రావులపాలెం చేరుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులకు కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్వాగతం పలికారు. వాడపల్లి ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ కార్యనిర్వాహక కార్యదర్శి  ముదునూరి సత్యనారాయణ రాజు, ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సజ్జల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని రాష్ట్రం పాడిపంటలతో తులతూగాలని ఆ భగవంతుడు ఆశీర్వాదం ప్రజలపై ఉండాలని కోరుకున్నానన్నారు. 

ఆయిల్ ట్యాంకర్ పేలి 84 మంది మృతి

ఆఫ్రికా దేశం సియెర్రా లియోన్​లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని ఫ్రీటౌన్​లో ఆయిల్ ట్యాంకర్ పేలడం వల్ల 84 మంది  మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ ఏజెన్సీ డైరెక్టర్ మొహమద్ లమ్రేన్ బా వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్.. గ్యాస్ స్టేషన్ వద్ద ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంధనం లీక్ అవుతుండటం వల్ల.. దాన్ని సేకరించేందుకు చాలా మంది ప్రజలు గ్యాస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓ బస్సు.. ఆయిల్ ట్యాంకర్​ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంధనాన్ని నింపుకోవడానికి వచ్చిన వారితో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది.

వాలంటీర్, మహిళా పోలీసుపై ఓ పార్టీ నేతలు దౌర్జన్యం 

చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం శెట్టి వానత్తం గ్రామ సచివాలయం వాలంటీర్ అనితపై కొంత మంది దౌర్జన్యానికి దిగారు. వీరంతా ఓ పార్టీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరిపై వాలంటీర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట వాలంటీర్ అనిత కన్నీరు మున్నీరుగా విలపించింది. సచివాలయంలో తనను కులం పేరుతో దూషించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు నెలల క్రితం అనిత పొలంలో కొంతమంది అగ్రవర్ణ నాయకులు రాత్రికి రాత్రి వేరుశనగ పంట వేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాలంటీర్ అనిత, మహిళా పోలీసుపై సచివాలయంలోని కొందరు దాడికి ప్రయత్నించారు. వాలంటీర్, మహిళా పోలీసు ఫోన్ లను లాక్కున్నారు. సచివాలయ సిబ్బంది మీద దౌర్జన్యం చేసిన నాయకులపై ఎస్ఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. 

అహ్మద్ నగర్ జిల్లా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది కరోనా రోగులు మృతి 

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలో మంటలు చెలరేగి 10 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ఐసీయూలో మొత్తం 17 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే కు నిరసనసెగ.. రాజీనామా డిమాండ్

హుజూరాబాద్ సీన్ అర్థం చేసుకున్న పలు నియోజకవర్గాల ప్రజలు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి నిరసన సెగ మొదలైంది. మీరు వెంటనే రాజీనామా చేస్తే మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కొదురుపాక గ్రామంలో రోడ్డుపై అడ్డగించి ఘెరావ్ చేశారు. 

రైతు చిన్న బీరయ్య కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన రైతు చిన్న బీరయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కుమారుడు రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.  10 రోజులుగా వడ్లు అమ్ముకోవడానికి వచ్చి గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేతలు సుభాష్ రెడ్డి గ్రామానికి వెళ్లి బీరయ్య కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా రైతు కుమారుడు రాజేందర్ తో రేవంత్ రెడ్డి మాట్లాడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

సిరిసిల్లలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల పట్టణంలోని కేడీసీసీ బ్యాంక్ నూతన భవనానికి ప్రారంభోత్సవం చేసిన మంత్రి కేటీఆర్

అగ్నిప్రమాదం.. బోటు నుంచి ఏడుగురు మత్స్యకారులను రక్షించిన నావికా సిబ్బంది

భారత నావికా దళాలు ఏడుగురు మత్స్యకారులను రక్షించారు. ప్రమాదవశాత్తూ బోటు అగ్నిప్రమాదానికి గురికావడంతో సిబ్బంది జాలర్లను కాపాడారు. కర్ణాటక, కర్వార్ లైట్ హౌస్ కు 10 నాటికల్ మైల్స్ దూరంలో ఈ ఘటన జరిగినట్లు కోస్ట్ గార్డ్ ఓ ప్రకటనలో తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నేటి ఉదయం 11:30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకు నూతన భవనం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు అటవీ భూముల సమస్యలపై అధికారులతో కలిసి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.

జగిత్యాల - వేములవాడ ప్రధాన రహదారిపై కారు బోల్తా.. ఎస్సైకు స్వల్ప గాయాలు

జగిత్యాల జిల్లా జగిత్యాల - వేములవాడ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మం. చెప్యాల మూల మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డ కారు, అందులో ప్రయాణిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా  చందుర్తి ఎస్సైకు స్వల్ప గాయాలు కాగా, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Background

మహారాష్ట్రలో సంచలనంగా మారిన ముంబయి డ్రగ్స్ కేసులో విచారణ అధికారి సమీర్ వాంఖడేను దర్యాప్తు నుంచి తొలగిస్తున్నట్లు ఎన్‌సీబీ ప్రకటించిందని కథనాలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో వాంఖడే పెద్ద ఎత్తున లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను దర్యాప్తు టీమ్ నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ వదంతులు మాత్రమేనని తెలుస్తోంది. 


బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో విచారణ బాధ్యతల నుంచి సమీర్ వాంఖడేను తప్పిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై నేరుగా అధికారి సమీర్ వాంఖడే స్పందించారు. తనను ముంబై డ్రగ్స్ కేసుతో పాటు ఇతర కేసుల విచారణ బాధ్యతల నుంచి  తనను ఎవరూ తప్పించలేదని తెలిపారు. అయితే తనపై ఆరోపణలు వస్తున్నందున ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ తాను కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని సమీర్ వాంఖడే స్పష్ట చేశారు. తన పిటిషన్‌కు స్పందనగా ముంబై డ్రగ్స్ కేసును ఎన్సీబీ ఢిల్లీ విభాగానికి చెందిన సిట్ దర్యాప్తు చేస్తుందని సమీర్ వాంఖడే వెల్లడించారు.


ఉప ఎన్నికల ఫలితాల ప్రభావమో, లేక కొన్ని రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయనే ముందుచూపుతో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించింది. గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా దిగొచ్చాయి. తాజాగా కొన్ని నగరాల్లో ధరలలో వ్యత్యాసం చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ ధర రూ. 103.97 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.86.67కు దిగొచ్చింది. 


కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్‌లో ఇంధన ధరలు తగ్గాయి. నగరంలో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 అయింది. డీజిల్ ధర లీటరుకు 12 రూపాయలు తగ్గడంతో రూ.94.62గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర లీటర్ రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.94.14 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపుగా ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో ధనత్రయోదశి సందర్భంగా నిలకడగా ఉన్న బంగారం ధరలు దీపావళి నుంచి పెరుగుతున్నాయి. బంగారం దారిలోనే వెండి పయనిస్తోంది. తాజాగా రూ.160 మేర పుంజుకోవడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,760 గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,700 గా ఉంది. ఇక వెండి ధర రూ.900 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.68,600 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలతో ట్రేడింగ్ జరుగుతోంది. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. నేటి ఉదయం 11:30 గంటలకు సిరిసిల్ల పట్టణంలో కేడీసీసీ బ్యాంకు నూతన భవనం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు అటవీ భూముల సమస్యలపై అధికారులతో కలిసి కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.