Breaking News Live: పేపర్ బ్యాలెట్ ద్వారా ‘మా’ ఎన్నికలు నిర్వహించాలి.. మంచు విష్ణు డిమాండ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
గోదావరి బోర్డు ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రజత్ కుమార్ లేఖరాశారు. చనాఖా- కొరటా డీపీఆర్ ఏపీకి ఇవ్వాల్సిన అవసరంలేదని తెలిపారు. చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గోదావరి నీటిని బోర్డు కేటాయింపుల మేరకే వాడుకుంటున్నామని రజత్ కుమార్ స్పష్టం చేశారు. రెండు ప్రాజెక్టులపై ఏపీ అభిప్రాయాలు అక్కర్లేదని రజత్ కుమార్ తెలిపారు.
ఏ ప్యానల్ గెలిచినా భవన నిర్మాణానికి రూ.6 కోట్లు ఇచ్చేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని సినీ నటుడు, మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తెలిపారు.. మా ప్యానల్‌లో చాలా మంది పేపర్ బ్యాలెట్ కావాలని అడిగారు. పేపర్ బ్యాలెట్ అయితే ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం అలాగే వస్తుంది. ఈవీఎం వాడితే ట్యాంపరింగ్ చేశారని ప్రకాష్ రాజ్ ఆరోపించే అవకాశం ఉంది. అందు కోసమే పేపర్ బ్యాలెట్‌కు వెళ్లామన్నారు. గత ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ వాడారని స్పష్టం చేశారరు. 60 ఏళ్లు పైబడిన వారికి పేపర్ బ్యాలెట్ ఇస్తారు. ఇప్పుడు మా సభ్యులలో 180 నుంచి 190 వరకు 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు
హుజురాబాద్ లోని సింగాపూర్ వద్ద మంత్రి హరీష్ రావు కాన్వాయ్ లోని వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న లగేజిని తనిఖీ చేసిన పోలీసులు హరీష్ రావుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, డబ్బు లేకపోవడంతో మంత్రిని వెళ్లనిచ్చారు.
వరంగల్ నర్సంపేటలో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక దారకపేటలోని ఐ.సీ.డీ.ఎస్ కార్యాలయం ఎదుట మురికి కాలువలో ముసలి కనిపించింది. పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వైపుగా వెళ్లే మార్గంలో ఓ మొసలిని స్థానికులు గుర్తించారు. ఐ.సీ.డీ.ఎస్ కార్యాలయం ఎదుట గల కాలువలో మొసలి పిల్ల స్థానికుల కంట పడింది. ఈ కాల్వ ఫైర్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంటడం గమనార్హం. సాధారణంగా నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్లే దారిలో గల పాకాల సరస్సులో మొసళ్లు ఉండటం తెలిసిందే. ఇదిలా ఉండగా నర్సంపేట పట్టణంలోని చిన్న కాలువలో మొసలి పిల్ల కనపడటం స్థానిక ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఇంకా ఎన్ని వచ్చాయోనని పట్టణంలో చర్చ జరుగుతోంది. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని ద్వారకపేట కాలనీవాసులు కోరుతున్నారు.
నెల్లూరులో జోరువాన కురిసింది. గంటసేపు భారీ వర్షం పడటంతో నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఉదయాన్నే వాతావరణం పొడిగా ఉన్నా, మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. నెల్లూరు నగరంలో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మొత్తం 1,013 పిటిషన్లపైనా విచారించిన కోర్టు తుది తీర్పు ఇవాళ వెలువరించింది. నాలుగు వారాల్లోగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 20 శాతం తగ్గించి చెల్లిస్తామన్న ప్రభుత్వ జీవో కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. బకాయిలను ఏడాదికి 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది.
ప్రియాంక గాంధీ సహా మొత్తం 11 మందిపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శాంతికి విఘాతం కలిగించారనే అభియోగంపై ప్రియాంకపై కేసు పెట్టినట్లు సీతాపుప్ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐర్ లేకుండా తనని ఎందుకు నిర్బంధంలో ఉంచారని ప్రియాంక ప్రశ్నించిన కాసేపటికే ఆమెపై పోలీసులు కేసు పెట్టారు.
కాకినాడ నగరపాలకసంస్థ మేయర్ సుంకర పావనిపై కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియ ముగిసినట్లు ప్రొసీడింగ్ అధికారి, జేసీ లక్ష్మీషా ప్రకటించారు. ఫలితాలను రిజర్వులో ఉంచినట్లు ప్రొసీడింగ్ అధికారు తెలిపారు. తీర్మానానికి అనుకూలంగా మొత్తం 36 మంది ఓటు వేశారు. 33 మంది కార్పొరేటర్లు మేయర్‌ను వ్యతిరేకించగా... ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి కన్నబాబు, ఎంపీ గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి తమ ఓటు వినియోగించుకున్నారు. 2017లో కాకినాడ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేటర్లలో ముగ్గురు మరణించగా, ఒకరు రాజీనామా చేశారు. ప్రస్తుతం 44 మంది కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన 31 మందిలో 22 మంది, ఇద్దరు భాజపా కార్పొరేటర్లు అసమ్మతితో ఉండగా... మొత్తం 33 మంది అవిశ్వాసంపై కలెక్టర్‌కు లేఖలు అందజేశారు. ఈ మేరకు ఇవాళ చేపట్టిన అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో మేయర్‌కు వ్యతిరేకంగా 36 మంది ఓటు వేశారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరీ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. యూపీ ఘటనను ఆయన ఖండించారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో రైతులపై నిర్దాక్షిణ్యంగా, కోల్డ్ బ్లడెడ్ మర్డర్‌ను చూసి భయం వేసింది. ఈ అనాగరిక సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా న్యాయం చేస్తారని ఆశిస్తున్నా’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా తలసరి విద్యుత్ వినియోగం గురించి ఆశాఖ మంత్రి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 2020-21 సంవత్సరానికి తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది. మొత్తం తలసరి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ 5వ స్థానంలో ఉంది. వృద్ధి రేటులో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9,600 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా చేర్చాం. 7,962 మెగావాట్ల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. టీఎస్ జెన్‌కో ద్వారా థర్మల్‌లో 2, 210 మెగావాట్లు, జల విద్యుత్తులో 3,360 మెగావాట్లు, ఇతర రంగాల నుంచి 2,200 మెగావాట్లు, ప్రైవేటు రంగాల నుంచి 570 మెగావాట్లు, సౌర విద్యుత్ నుంచి 3,415 మెగావాట్లు, పవన విద్యుత్ నుంచి 128 మెగావాట్లు అదనంగా చేర్చాం. టీఎస్ జెన్‌కో ద్వారా నిర్మాణంలో ఉన్నవి 4,270 మెగావాట్లు, ఎన్టీపీసీ ద్వారా 1600 మెగావాట్లు, సౌరవిద్యుత్ ద్వారా 2,092 మెగావాట్లు.. మొత్తం కలిసి 7,962 మెగావాట్లు నిర్మాణ దశలో ఉన్నాయి.’’ అని మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు.
తెలంగాణ అసెంబ్లీలో దళిత బంధు పథకంపై నేడు చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల తర్వాత దళిత బంధుపై స్వల్పకాలిక చర్చ చేయనున్నారు. మైనార్టీల సంక్షేమం, పాత బస్తీలో అభివృద్ధిపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. సోమవారం అసెంబ్లీ ఆమోదించిన జీఎస్టీ చట్టసవరణ బిల్లు, టౌటింగ్ చట్టం బిల్లుపై నేడు మండలిలో చర్చ చేపడతారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర స్ఫూర్తితో దసరా పండుగను సందర్భంగా ఈ నెల 10న కలశ యాత్ర నిర్వహిస్తున్నారు. వెయ్యి మంది మహిళలు తలపై కలశం పెట్టుకొని సికింద్రాబాద్ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ఉజ్జయిని మహాంకాళి ఆలయం వరకు పాదయాత్ర చేస్తారని నిర్వహకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగానే కలశ యాత్ర పోస్టర్‌ను సంజయ్ ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే రాజయ్య మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జనగామ జిల్లా చిలుపూర్ మండలం లింగంపల్లిలో సోమవారం బతుకమ్మ చీరలను దహనం చేశారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి కండ్లకోలు బాలరాజు నేతృత్వంలో చీరలను దహనం చేశారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య తక్షణమే అంబేద్కర్ విగ్రహం ఎదుట క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ తల్లి, తండ్రి, భర్త అంటూ నోరు జారిన సంగతి తెలిసిందే.
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -