Breaking News Live: తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం... 40 మంది విద్యార్థులకు పాజిటివ్..!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 22 Jan 2022 10:01 PM
తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం 

తిరుపతి ఐఐటీలో కరోనా కలకలం రేగింది. నలభై మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. హాస్టల్లో ప్రస్తుతానికి 170 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ ను ఐసోలేషన్ సెంటర్ గా మార్చినట్లు తెలుస్తోంది. 


 

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్‌కు కరోనా

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోను ద్వారా సంప్రదించాలని కోరారు. మాస్కులు,శానిటైజర్ లు విధిగా వాడాలని సూచించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో 2.7 కేజీల బంగారం సీజ్, విలువ రూ.1.36 కోట్లు

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుండి హైదరాబాద్ గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 2715.800 గ్రాములు, 1 కోటి, 36లక్షల విలువైన గోల్డ్ సీజ్ చేశారు. చైన్స్, పేస్ట్ రూపంలో హ్యాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

గచ్చిబౌలిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి.. 12 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

గచ్చిబౌలిలో పేకాట స్థావరంపై మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. గచ్చిబౌలి గ్రీన్ ల్యాండ్ కాలనీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని పేకాట నిర్వహిస్తున్న కాకర్ల మార్క రెడ్డి.. నిర్వాహకులతో పాటు 12 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తొమ్మిది లక్షల నగదు, 14 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. రోజు వారి అద్దె చెల్లించి మార్క రెడ్డి ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పేకాట నిర్వహిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేశారు.

ఆదివాసీలపై దాడులను ఖండించిన మంత్రి సత్యవతి రాథోడ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలంలో రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ గూడెం, సాకివాగుకు చెందిన  ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారన్న సంఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ ను ఆదేశించారు. 

కర్నూలు జిల్లా పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం

కర్నూలు జిల్లా పత్తికొండలో ఎరుకల యల్లయ్య అనే వ్యక్తి ఇంటిలో పోలీసులు 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్షన్ జోన్ మరియు స్పెషల్ బ్రాంచ్ పోలీసుల ఆధ్వర్యంలో అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేస్తుండగా భారీ ఎత్తున నాటు బాంబులు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. గత వారం రోజుల కిందట పొలములో మహిళ చేతిలో నాటు బాంబు పేలింది. వారం రోజులుగా నాటు బాంబులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

వరంగల్‌ ఎన్‌ఐటీ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఆదూరి ప్రమోద్‌కుమార్‌ వరంగల్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం ఈఈఈ చదువుతున్నాడు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. దీంతో ఒత్తిడికి గురై మెరిట్ స్టూడెండ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

Background

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. ఇటీవల కొన్ని రోజులపాటు వర్షాలు కురవడమే అందుకు కారణం. తాజాగా ఏపీలో వాతావరణం పొడిగా మారనుంది. వర్షాలు తగ్గినా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం అలాగే ఉన్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేశాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో చలి తీవ్రత తగ్గడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. 


తెలంగాణలో అకాల వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్, పలు జిల్లాల్లో చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండనుంది.


ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి రెండు రోజులపాటు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. 


బంగార ధర వరుసగా మూడో రోజు పుంజుకుంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. తాజాగా హైదరాబాద్‌‌లో రూ.100 మేర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,650 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,800గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,300 అయింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,300కు ఎగబాకింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


హైదరాబాద్‌లో గత ఏడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 16 పైసలు పెరిగి లీటర్ ధర రూ.110.51 అయింది. ఇక్కడ డీజిల్ పై 15 పెరగడంతో లీటర్ ధర రూ.96.59 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.31 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.36 అయింది. డీజిల్ పై 0.29 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.47 కు చేరింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.