Breaking News Live Updates: యాదగిరిగుట్టలో కూలిన రెండు అంతస్తుల భవనం, ముగ్గురు మృతి

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 29 Apr 2022 07:10 PM
యాదగిరిగుట్టలో కూలిన రెండు అంతస్తుల భవనం, ముగ్గురు మృతి

తెలంగాణలోని యాదగిరిగుట్టలో రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అని గాలిస్తున్నారు. 

Ramya Murder Case: రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష పడింది. నిందితుడిగా ఉన్న శశిక్రిష్ణను ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపై ఈ హత్య జరిగింది. తొమ్మిది నెలల్లోలనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడికి శిక్ష వేసింది. 

Prakasam: స్వామీజీ మాటలు నమ్మి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయిన యువతి

ప్రకాశం జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. తన వల్ల తన తల్లిదండ్రులకు అపాయం ఉందని ఓ స్వామీజీ చెప్పగా, అతని మాటలు నమ్మిన ఆమె ప్రాణాలు తీసుకోబోయింది. అంతకుముందు ఈ విషయంపై ఆమె తన తండ్రికి లేఖ కూడా రాసింది. మార్కాపురంలోని ఓ లాడ్జిలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతి రాసిన లేఖ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Guntur: దుగ్గిరాలలో మహిళపై అత్యాచార యత్నం

* దుగ్గిరాల మండలంలో మరో మహిళపై అఘాయిత్యానికి యత్నం


* శృంగారపురం గ్రామంలో మహిళను బలవంతంగా లాక్కెల్లే ప్రయత్నం 


* కూలీ పనుల కోసం వచ్చిన  మహిళను పొలాల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేసిన యువకులు 


* స్థానిక తిరుపతమ్మ ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో ఘటన 


* మహిళ కేకలు వేయడంతో పారిపోయిన యువకులు, నిందితులు బైక్ వదిలి పరారీ


* డయల్ 100కు ఫిర్యాదు చేసిన కూలీలు


* జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు, బైక్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు

Daughter Kills Father: తండ్రిని కర్రతో మోది చంపిన కూతురు

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న తండ్రిని కూతురు కర్రతో మోది చంపేసింది. మహబూబాబాద్ మండలం వేమునూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి  పత్రాలు తండ్రి ఇవ్వడం లేదనే కోపంతో తండ్రి వెంకన్న (46)ను కూతురు ప్రభావతి (17) కర్రతో కొట్టి చంపింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కమలాపూర్ మండలంలో దారుణం

* కమలాపూర్ మండలంలో దారుణం
* 15 ఏళ్ల మైనర్ బాలికను రేప్ చేసిన దుండగులు
* గత పది రోజుల ప్రభుత్వ పాఠశాలలో గ్యాంగ్ రేప్ పాల్పడిన దుండగులు
* పోలీసుల అదుపులో ఐదుగురు యువకులు
* మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు
* ఒక యువకుని అదుపులోకి తీసుకొని మిగిలిన నలుగురిని వదిలేసిన పోలీసులు

Background

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న వేళ, ఉన్నట్టుండి తెలంగాణ, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న (ఏప్రిల్ 28) వరుణుడు చల్లగా పలకరించాడు. ఓ వైపు గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రతిరోజూ అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కొద్దిసేపు కురుస్తున్నాయి. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి.


తాజాగా హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల మేరకు.. తెలంగాణలో ఒకటి లేదా రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు లేదా చిరుజల్లులు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. కానీ, అధిక ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణం కేంద్రం పసుపు రంగు అలర్ట్ జారీ చేసింది.


తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం - ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఒకటి రెండు ప్రదేశాల్లో వడ గాడ్పులు వీచే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది’’ అని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది. మే 1 వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.


ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఏప్రిల్ 30 వరకు జల్లులు అక్కడక్కడ కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రికి వర్షాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది.


భారత వాతావరణ విభాగం హెచ్చరిక
మరో 5 రోజుల పాటు ఎండలు ఇంకా మండిపోతాయని భారత వాతావారణ విభాగం ప్రకటించింది. తీవ్ర ఎండల కారణంగా రానున్న 5 రోజుల్లో కనీసం 5 రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.


45 డిగ్రీల పైనే
రాజస్థాన్, దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే ఉంటాయని తెలిపింది. మే నెల మొదటివారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత వర్షాలకు అవకాశాలున్నాయని ఐఎండీ శాస్త్రవేత్త ఆర్‌కే జెనమణి పేర్కొన్నారు.


మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ 45 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. దిల్లీలో గురువారం గరిష్ఠంగా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. శుక్రవారం 45 డిగ్రీల సెల్సియస్ మార్క్‌‌ను తాకే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది.


122 ఏళ్లలో
2022 మార్చి - ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. 1901 తర్వాత భారత్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు చేసిన మార్చి నెల.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.