Breaking News Live Updates: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, దంపతులు అక్కడికక్కడే దుర్మరణం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Apr 2022 02:40 PM
KCR: సీఎం కేసీఆర్ - జార్ఖండ్ మాజీ సీఎం రేపు భేటీ?

సీఎం కేసీఆర్‌‌తో జార్ఖండ్ మాజీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరేన్ తన తల్లి వైద్యం కోసం శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే వారు ఇద్దరూ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జాతీయ రాజకీయాలపై కేసీఆర్, శిబూ సోరేన్ చర్చలు జరుపుతారని సమాచారం.

CM KCR Nalgonda Tour: నల్గొండ చేరుకున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లా నార్కట్‌ పల్లికి చేరుకున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ్మ సంతాప సభకు సీఎం హాజరు అయ్యారు. ఎమ్మెల్యే లింగయ్యను పరామర్శించారు. లింగయ్య తండ్రికి గతంలోనే మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు నివాళులర్పించారు. 

Kurnool News: బడిలో ప్రమాదం- పైకప్పు పెచ్చులు ఊడి పడి విద్యార్థులకు గాయాలు

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మండల ప్రాథమికొన్నత ఉర్దూ పాఠశాలలో కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరి విద్యార్థులకు గాయాలు అయ్యాయి. రెండో తరగతి చదువుతున్న విద్యార్థులు అంత క్లాస్ రూమ్‌లో ఉండగా ఒక్కసారిగా సీలింగ్‌పై కప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో తరగతి గదిలో సఫాన్, అరిఫ్ విద్యార్థులకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పాఠశాలలో తరగతి గదులు శిథిలావస్థకు చేరింది అని తల్లిదండ్రులు ఎన్నో సార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా పాఠశాల ను రూపురేఖలు మార్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పట్నం మహేందర్ రెడ్డిపై మరో కేసు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఐను దూషించారనే ఆరోపణల వేళ ఆయనపై మరో కేసు నమోదైంది. ఐపీసీ 353, 504, 506 కింద కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Patnam Mahender Reddy: పట్నం మహేందర్ తిట్టిన మాట వాస్తవమే: CI రాజేందర్

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తను బూతులతో తిట్టారని తాండూరు సీఐ రాజేందర్‌ రెడ్డి గురువారం తెలిపారు. తనకు చాలా బాధ కలిగిందని, తనపై చేసిన వ్యాఖ్యలపై తాను ఫిర్యాదు చేశానని అన్నారు. తాను ఇసుక మాఫియాకు, రౌడీ షీటర్లకు కొమ్ము కాస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు.

Siddipet: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, దంపతులు అక్కడికక్కడే దుర్మరణం

సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భార్యాభర్తలు చనిపోయారు. గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపూర్ వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గజ్వేల్‌కు చెందిన వారుగా గుర్తించారు. అలాగే గాయాల పాలైన వారు గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Background

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు గత వారం రోజుల నుంచి ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రతిరోజూ అక్కడక్కడా చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉత్తర కోస్తాంధ్రలో 40 డిగ్రీల వరకు ఉండగా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  


ఉత్తర కోస్తాంధ్రలో, యానాంలో..
ఉపరితల ద్రోణి ప్రభావం, ట్రోపో వాతావరణంలో గాలుల ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో ఏప్రిల్ 30 వరకు జల్లులు అక్కడక్కడ కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజులపాటు ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఉదయం చలి, మధ్యాహ్నం ఎండ, రాత్రికి వర్షాలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువైంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువైంది.


ఏపీ వెదర్ మ్యాన్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం పార్వతీపురం వైపు మొదలైన భారీ పిడుగులు, వర్షాలు విజయనగరం జిల్లా సలూరు వైపుగా కదిలాయి. విజయనగరం జిల్లాలోని పలు భాగలతో పాటుగా పార్వతీపురం మణ్యం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు, పిడుగులు పడ్డాయి. ‘‘ఇవి ఎండాకాలం వర్షాలు. అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. మధ్యాహ్నం సమయం ఉన్న వేడి, కాస్తంత తేమ గాలుల వల్ల ఈ వర్షాలు కురుస్తాయి. మరో వైపున విశాఖ నగరంలో రాత్రి ఎక్కడ వర్షాలు ఉండవు. రాత్రంతా ఉక్కపోతగా, వేడిగా ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.


తెలంగాణలో ఇలా Telangana Weather Updates
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువయ్యాయి. కర్నూలు, కడప​, నంద్యాల​, అనంతపురం, శ్రీకాకుళం, విజయనరం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను తాకుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల​, జగిత్యాల​, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలను తాకుతోంది. రానున్న ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుంది. కొన్ని చోట్ల 46 డిగ్రీల దాకా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు. నిన్న కాస్త తగ్గడంతో ఇంకా తగ్గుతుందేమో అన్న అంచనా వేశారు కానీ ధరలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,450 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,860 గా ఉంది. 


వెండి మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. కేజీపై రెండు వందల రూపాయలు తగ్గింది. స్వచ్ఛమైన కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నిన్న రూ.70,000 వద్ద ఉంది. ఇవాళ రూ. 69,800లకు తగ్గింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,450 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,860గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.69,800 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,450 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,860గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,800 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.