KCR And Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఏపీ పాలిటిక్స్‌లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తూ సీఎం జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. అయితే జగన్‌ను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ,జనసేన కలిపి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. ఈ పొత్తులో బీజేపీ కూడా కలిసే అవకాశముందని వార్తలొస్తున్నాయి. ఇక కర్ణాటక, తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన హస్తం పార్టీ.. పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా బలం పుంజుకునేందుకు కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా జగన్‌కు వ్యతిరేకంగా ఆయన సొంత చెల్లి షర్మిలను ఏపీలో కాంగ్రెస్ రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఇప్పటికే వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించగా.. రేపు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో వైఎస్సార్‌టీపీని విలీనం చేయనున్నారు.


ఈ సమయంలో గురువారం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ కానుండటం కీలకంగా మారింది. గురువారం హైదరాబాద్ రానున్న జగన్.. బంజారాహిల్స్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్‌ను జగన్ పరామర్శించనున్నారు.  ప్రస్తుతం కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇంత ఆలస్యంగా కేసీఆర్‌ను జగన్ పరామర్శించనుండటం గమనార్హం. దీంతో ఇరువురి భేటీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే సినీ, రాజకీయ ప్రముఖులందరూ వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్‌ను పరామర్శించారు.


కానీ కేసీఆర్‌ను సీఎం జగన్ పరామర్శించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు, టీడీపీ-జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరనుందనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్‌ను జగన్ కలవనుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేసీఆర్‌ను తన రాజకీయ గురువుగా జగన్ భావిస్తారు. జగన్‌ను తన తమ్ముడిగా కేసీఆర్ భావిస్తారు. కేటీఆర్, జగన్ కూడా మంచి స్నేహితులు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో కేటీఆర్ బాహాటంగానే చెప్పారు. జగన్, తాను మంచి మిత్రులమని, కలిసినప్పుడు ఇద్దరం స్నేహపూర్వకంగానే మాట్లాడుకుంటామని కేటీఆర్ చెప్పారు. రాజకీయంగా తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని, రాష్ట్రాల పరంగా ఉంటాయన్నారు. ఈ పరిచయాల క్రమంలో గత ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కొనేందుకు జగన్‌కు కేసీఆర్ అండదండలు అందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉంటాయి. అలాగే 2018 తెలంగాణ ఎన్నికల్లో కూడా సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్‌కు పడేలా వైసీపీ హెల్ప్ చేసింది. కేసీఆర్, జగన్ మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో వీటిని బట్టి తెలుస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి.  


కానీ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌కు జగన్ సహాయం చేయలేదు. బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్‌తో సంబంధం లేనట్లుగానే వైసీపీ వ్యవహరించింది. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతో కొంత ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మారడంతో ఏపీ ప్రజల మూడ్ కూడా మారుతుందని భావించేవారు ఉంటారు. కేసీఆర్‌ను జగన్ కలవక చాలా రోజులైంది. దీంతో రేపు జరగనున్న భేటీ కీలకంగా మారింది.