AP CM Jagan called KTR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. కాలు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శస్త్ర చికిత్స పొందుతున్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం జగన్ ఆరా తీశారు. కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్‌కు సీఎం జగన్ ఫోన్ చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి ఏపీ సీఎం తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు.
కేసీఆర్ కోలుకోవాలని ప్రముఖుల ఆకాంక్ష
బీఆర్ఎస్ అధినేత (Brs Chief), తెలంగాణ మాజీ సీఎం ( Ex Chief Minister ) కేసీఆర్(KCR) త్వరగా కోలుకోవాలని జనసేనాని చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డానన్న ఆయన....కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్, ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని వెల్లడించారు. బాత్‌రూమ్‌లో జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిందన్న వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని, కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు. యశోదాలో కేసీఆర్ కు ఆపరేషన్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆరా
గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన రిజ్వీ...ఆ తర్వాత సీఎం రేవంత్ కు పరిస్థితిని వివరించారు.