Telangana Rains Update | హైదరాబాద్: బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మంగళవారం నాడు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం, రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మంగళవారం సైతం వర్ష సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Continues below advertisement

ఈ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలువాతావరణ శాఖ సూచనల ప్రకారం, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

వివిధ ప్రాంతాల్లో వర్షపాతం వివరాలుమరోవైపు రాష్ట్రంలో గత ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలుచోట్ల భారీగా, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యు) మండలంలో 10.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అలాగే నల్గొండ జిల్లా కట్టంగూరులో 8.2 సెంటీమీటర్లు, నిజామాబాద్‌ గ్రామీణ మండలం మల్కాపూర్‌లో 8.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు వర్ష సూచనపశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావం కారణంగా మంగళవారం (జులై 21న) రోజున పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని వెల్లడించింది.

పిడుగులతో కూడిన వర్షాలు

 శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు (పోలవరం ప్రాంతం), కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు  ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసినట్లు APSDMA పేర్కొంది