BRS News :  ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన నేతలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ లో  అవకాశం ఉన్న వాళ్లు  అసలు వదిలి పెట్టడం లేదు. ఇటీవలే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని లాంఛనంగా కాంగ్రెస్‌లో చేరికే మిగిలిందని చెబుతున్నారు. 


కల్వకుర్తి టిక్కెట్ ఆశించిన కసిరెడ్డి 
 
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.  మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం టిక్కెట్ ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్ ను ఖరారు చేశారు. దీంతో టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనేతలతో చర్చించారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.


కాంగ్రెస్ నుంచి టిక్కెట్ ఆఫర్ 
 
 అధికార పార్టీ బీఆర్ఎస్‌లో టికెట్​దక్కుతుందని ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డికి హైకమాండ్ షాక్ ఇచ్చింది. దీంతో  ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనంటూ ఆయన అనుచరులు  కసిరెడ్డిపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయంగా ఉనికి కోల్పోతామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పెద్దలు ఎమ్మెల్సీ కసిరెడ్డిని బుజ్జగించారు. ఆయన కూడా పోటీకి దూరంగా ఉండాలనే అనుకున్నారు. కానీ   క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇదే సమయంలో  మాజీ ఎమ్మెల్యే, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు వంశీచంద్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు రేవంత్​రెడ్డిలు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరిపారు. ఆయనకు కల్వకుర్తి అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. దాంతో చేరికను ఖరారు చేసుకున్నారు. 


టిక్కెట్ త్యాగం చేస్తున్న వంశీచంద్ రెడ్డి 


ఈ స్థానం నుంచి వంశీచంద్​రెడ్డి పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ సీడబ్లూసీలో ప్రత్యేక ఆహ్వానితుడుగా వంశీచంద్ రెడ్డి ఉన్నారు. పార్టీ పనుల్లో బిజీగా ఉంటారు.  అందుకోసం ఆ నియోజకవర్గంలో గెలుపు లక్ష్యంగా అభ్యర్థిని గుర్తించి కసిరెడ్డి నారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోసారి కసిరెడ్డి తమ అనుచరులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈనెల 29వ తేదీన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఢిల్లీ కాంగ్రెస్​పెద్దల సమక్షంలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. 


బీఆర్‌ఎస్‌లో ఉంటూ సీటు దక్కదని తేలడంతో పార్టీ మారైనా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని అనేక మంది భావిస్తున్నారు. కేసీఆర్  పెద్దగా మార్పులు లేకుండానే సిట్టింగ్‌లందరికీ దాదాపుగా సీట్లు ఖరారు చేశారు. దీంతో అసంతృప్త నేతలు ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు.