Another Elephant In Asifabad District: కుమురం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో ఏనుగుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే గత రెండు రోజుల్లో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందగా.. శుక్రవారం మరో ఏనుగు సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మురళిగూడ ములసమ్మగుట్ట ఏరియాలో సంచరిస్తుండగా.. స్థానికులు ఆ దృశ్యాలు చిత్రీకరించారు. దీంతో మురళిగూడ, పాపన్నపేట్, తలాయి, కమ్మర్గాం, నందిగాం, గంగానది ఒడ్డున ఉన్న మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో 60 మంది ప్రత్యేక బృందంతో గజ రాజం ఆచూకీ కోసం గాలిస్తున్నారు. గజరాజుల ఆకలి తీర్చేందుకు అరటి పండ్లు, పుచ్చకాయలు అందుబాటులో ఉంచారు. ఏనుగును ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర వైపు మళ్లించేందుకు చర్యలు చేపట్టారు.
ఇద్దరు మృతి
కాగా, జిల్లాలో ఏనుగులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఏనుగులు పంటలు నాశనం చేస్తూ.. కనిపించిన వారిపై దాడి చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం పొలానికి వెళ్లిన అల్లూరి శంకర్ అనే రైతును ఏనుగులు తొక్కి చంపేశాయి. అలాగే, పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన కారు పోచయ్య(50)అనే రైతు గురువారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. కరెంటు మోటార్ వేస్తున్న క్రమంలో అతనిపై ఏనుగులు దాడి చేశాయి. దీంతో పోచయ్య స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా.. అటవీ అధికారులు వివరాలు సేకరించారు. ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపేందుకు చర్యలు చేపట్టారు.
Also Read: IPL 2024: క్రికెట్ ఫీవర్, పోలీసులపై అభిమానుల ఆగ్రహం - ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత