ippasara Anirudh Reddy : పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో గుడుంబా తాగితే తప్పులేదు కానీ, తాను సారా అంటే తప్పెలా అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. సినిమా వాళ్లు గ్లాసు పట్టుకుంటే హీరోలని, రాజకీయనాయకులు పట్టుకుంటే జీరోలని అనడంపై ఆయన మండిపడ్డారు. ఇటీవల ఆయన ఇప్పసారాను ప్రమోట్ చేస్తున్నారు. దానిపై నిషేధం ఉండటంతో దాన్ని తొలగించాలని ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పపువ్వు సాగు, దాని ద్వారా గిరిజనుల ఆర్థికాభివృద్ధిపై అనే పేరుతో ఇప్పసారాను మళ్లీ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. అనిరుధ్ రెడ్డి చేపట్టిన ఉద్యమం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల ఇప్పపువ్వు చెట్లు నాటాలని డిమాండ్ చేస్తూ ఆయన ఒక వినూత్న సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రతిపాదనకు శాసనసభ్యుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన చెబుతున్నారు.
ఇప్పటికే ఈ ఉద్యమానికి మద్దతుగా దాదాపు 52 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేసినట్లు అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న అటవీ భూముల్లో ఇప్ప చెట్లను పెంచడం ద్వారా అటు పర్యావరణాన్ని కాపాడటంతో పాటు, ఇటు గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు శాశ్వత ఉపాధి కల్పించవచ్చని ఆయన బలంగా వినిపిస్తున్నారు. సభలోనూ, వెలుపల కూడా ఈ అంశంపై ఆయన తన వాదనను గట్టిగా వినిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇప్పపువ్వు విశిష్టతను, దాని ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనిరుధ్ రెడ్డి సినిమా సీన్లను వాడుకుంటున్నారు. ఖుషీ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ సీన్ లో గుడుంబా తాగుతారు. దాన్ని చూపిస్తూ.. రాజకీయ నేతలు ఇప్పసారా అంటే ట్రోల్ చేస్తారా..మరి హీరోలు ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పసారా అనేది కేవలం మద్యం మాత్రమే కాదని, అది గిరిజన సంస్కృతిలో ఒక భాగమని, ఎన్నో ఔషధ గుణాలు కలిగిన పానీయమని పేర్కొన్నారు.
అడవుల్లో ఇప్ప పువ్వు సేకరణను క్రమబద్ధీకరించి, దానికి చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అనిరుధ్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, మెజారిటీ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత దీనిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. అయితే సినిమా సీన్లన్నీ పూర్తిగా కల్పితం. నిజం కాదు. అయినా నిజంగానే పవన్ గుడుంబా తాగినట్లుగా చెప్పి.. ఇప్పసారా వాదనను సమర్థించుకోవడం మాత్రం రాజకీయ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
