Breaking News Live: చిల్లేపల్లిలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కారు అద్దాలు ధ్వంసం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 15 Nov 2021 06:29 PM
పూర్వ విద్యార్థుల సమావేశంలో అశ్లీల నృత్యాలు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో నల్లమల్ల రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు సమావేశంలో అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. కార్తీక వనభోజనాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జాతర్లు పేరు ఏదైనా రాజకీయ అండ పోలీసులు దన్ను ఉండడంతో అశ్లీల ప్రదర్శనలు సర్వ సాధారణమైపోయింది. అనపర్తిలో నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996-97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. నల్లమిల్లి రామారెడ్డి( నేషనల్ ) తోటలో అశ్లీల ప్రదర్శనలు బహిరంగంగా నిర్వహించడం నిర్వాహకుల తీరును పలువురు తప్పుబడుతున్నారు. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడుతున్నారు. 

చిల్లేపల్లిలో ఉద్రిక్తత.. బండి సంజయ్ కారు అద్దాలు ధ్వంసం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సూర్యపేట జిల్లా చిల్లేపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం నుంచి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. 

మున్సిపల్, నగరపాలికల్లో ముగిసిన పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికలు ముగిశాయి. నెల్లూరు నగరపాలిక, 12 పురపాలికల్లో ఎన్నికలు ముగిశాయి. కుప్పం, దాచేపల్లి, గురజాల, దర్శి పురపాలికల్లో ఇవాళ పోలింగ్‌ జరిగింది. జగ్గయ్యపేట, కొండపల్లి, ఆకివీడు, బుచ్చిరెడ్డిపాలెంలో కమలాపురం, రాజంపేట, పెనుకొండ, బేతంచర్ల పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 5 వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం ఉంది. ఎల్లుండి మున్సిపల్‌, నగరపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 


 

టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అరెస్టు

కుప్పంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేశారు. గౌనివారి శ్రీనివాసులను ఎందుకు అరెస్టు చేశారని టీడీపీ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. టీడీపీ కార్యకర్తల వాహనాలను పోలీసులు ధ్వంసం చేశారు. 

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేఆర్ఎంబీ సబ్ కమిటీ పర్యటన

నాగార్జునసాగర్ ప్రాజెక్టును కేఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ పరిశీలించింది. ఈ పర్యటనలో భాగంగా సాగర్ కుడి కాల్వను కమిటీ కన్వీనర్ కె.ఆర్.పిళ్లై పరిశీలించారు. సబ్ కమిటీని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కలిసింది. ఏపీ నీటి హక్కులను కాపాడాలని సాగు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు గోపాలకృష్ణారావు కోరారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించే అక్రమ పాజెక్టులు ఆపాలని విన్నవించారు. అనంతరం సాగు కుడి కాల్వ రైతుల సమస్యలపై కమిటీకి వినతిపత్రం అందజేశారు.

కుప్పంలో టెన్షన్ టెన్షన్.. దొంగ ఓటర్లు ఉన్నారంటూ ఆందోళన

కుప్పంలోనూ టెన్షన్ నెలకొంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ.. టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. 16వ వార్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి.. మనోహర్ ను లోపలికి అనుమతించాలంటూ.. ఆందోళన చేశారు. విశాఖ 31వ వార్డు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉమెన్స్ కాలేజీ దగ్గరకు ఎంపీ విజయసాయిరెడ్డి వచ్చారు.

నల్గొండకు బండి సంజయ్.. ఉద్రిక్తత

నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన ఘర్షణకు దారి తీసింది. నల్గొండ జిల్లాలోని ఆర్జాలబావి వద్ద ఓ ధాన్యం కొనుగోలు కేంద్రానికి సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకొని నల్ల జెండాలను ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని గొడవను ఆపేందుకు యత్నిస్తున్నారు.


 

కుప్పం నగర పంచాయతీలో 16వ వార్డులో ఉద్రిక్తత

కుప్పం నగర పంచాయతీలో 16వ వార్డులో ఉద్రిక్తత కొనసాగుతోంది. తమను పోలింగ్ బూత్ నుంచి తరిమేస్తున్నారంటూ టీడీపీ అభ్యర్థి, జనరల్ ఏజెంట్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఎంపీ రెడ్డప్ప, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. 

టీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశం

టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్ సోమ‌వారం ఉద‌యం ప్రగతి భవన్‌లో స‌మావేశం అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక‌పై కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోగా ఎమ్మెల్సీ అభ్యర్థుల‌ను ప్రక‌టించే అవ‌కాశం ఉంది. రేపు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేష‌న్లను దాఖ‌లు చేయ‌నున్నారు. ఎమ్మెల్యే కోటాలో 6 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగతి తెలిసిందే.

కార్తీక పుణ్య స్నానాల్లో అపశ్రుతి

విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో కార్తీక మాస పుణ్య స్నానాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పుణ్యస్నానాల కోసం నదిలోకి దిగి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోటవల్లూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో కార్తీక సోమవారం కార్తీక స్నానాలు చేసేందుకు ముగ్గురు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్‌ నదిలోకి దిగారు. నీటి ప్రవాహం గమనించకపోవడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైనవారిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మరో యువకుడి డెడ్‌బాడీ కోసం గాలిస్తున్నారు. విశాఖ జిల్లా గోస్తని నదిలో స్నానానికి దిగి తొమ్మిదేళ్ల బాలుడు గల్లంతు అయ్యాడు. పద్మనాభం మండలం పాండ్రంగిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గంజాయి ముఠా అరెస్టు

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఇంటెలిజెన్స్‌ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు ఈ ముఠాను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1,240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి 3 కార్లను కూడా పోలీసులు సీజ్‌ చేశారు. విశాఖపట్నం సమీపంలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు.

పెనుకొండలో ఎంపీ గోరంట్లను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే పార్థసారథి

అనంతపురం జిల్లా పెనుకొండలో 17వ వార్డులోకి వెళ్తున్న పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్‌ (వైఎస్సార్ సీపీ నేత)ను హిందూపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారథి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బస్వారాజ్ బొమ్మై, పుదుచ్చేరి హోంమంత్రి ఓంనమశ్శావాయమ్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రముఖులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు బాగుండాలి, సదరన్ జోనల్ మీటింగ్‌కు ఏర్పాట్లని భారీగా నిర్వహించారని అన్నారు. 

కుప్పం నగర పంచాయతీలో 24 వార్డులకు పోలింగ్

తిరుపతి : కుప్పం మునిసిపల్ (కుప్పం నగర పంచాయతీ) ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 25 వార్డులో ఒక్క వార్డు ఏకగ్రీవం కాగా, మిగతా 24 వార్డులకు ఎన్నిక జరుగుతోంది. మునిసిపల్ ఎన్నికకు మొత్తం 48 పోలింగ్ కేంద్రాలు.. 48 మంది పోలింగ్ అధికారులు, 48 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులున్నారు. సమస్యాత్మక ప్రాతం కావడంతో 100 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల పర్యవేక్షణకు 7 మంది పర్యవేక్షకులను నియమించారు. 16 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 22 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఒక్కో సమస్యాత్మక పోలింగ్ కేంద్రానికి 10 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.. మున్సిపాలిటీ పరిధిలో 39259 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పెనుకొండ నగర పంచాయితీకి మొదటి సారి పోలింగ్

అనంతపురము: పెనుకొండ నగర పంచాయితీకి మొదటి సారి పోలింగ్ జరుగుతోంది. పెనుకొండ నగర పంచాయితీలో 20 వార్డులలో పోలింగ్ ప్రారంభమైంది. అధికారులు 22 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. 153 మంది రెవెన్యూ సిబ్బంది 300 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విదుల్లో పాల్గొంటున్నారు. 9 సమస్యాత్మక కేంద్రాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 20,560 మంది ఓటర్లున్నారు.

కేబీఆర్ పార్కు వద్ద నటిపై దాడి

హైదరాబాద్‌లో ఓ నటిపై దుండగుడు దాడి చేశాడు. బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్క్‌ రోడ్‌ నంబర్‌ 9 వద్ద నటి చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడిచేశాడు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో చౌరాసియాకు గాయాలయ్యాయి. చివరికి, దుండగుడు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. వెంటనే నటి డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్‌ వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Background

విభజన హామీలపై సీఎం జగన్ కీలక ఉపన్యాసం
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని సీఎం జగన్ అన్నారు. విభజన జరిగి ఏడేళ్లైనా హామీలు ఇప్పటి వరకూ అమలుకాలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. తెలంగాణ నుంచి విద్యుత్ బాకీలు రాలేదన్న సీఎం.. రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు పూర్తికాలేదన్నారు. విద్యుత్ రుణాల్లో కోత విధిస్తున్నారని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారించాలని సీఎం జగన్ కోరారు. దీని కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో మాట్లాడిన సీఎం జగన్.. విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. 


పసిడి, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. పసిడి ధర గ్రామునకు రూ.1 పెరగ్గా.. వెండి ధర స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో గ్రాముకు రూ.1 పెరిగి.. రూ.46,110 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.50,190 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.71,700గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి. 


ఇంధన ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగింది. దీంతో తాజా ధర రూ.107.88 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కప్ గెల్చిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా 14 సంవత్సరాల కల ఎట్టకేలకు నెరవేరింది. పొట్టి ఫార్మాట్‌లో మొట్టమొదటిసారి విశ్వవిజేతగా నిలిచింది. 2007లో మొదటి టీ20 వరల్డ్ కప్ జరిగినప్పటి నుంచి ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం ప్రయత్నిస్తూనే ఉంది. వారి ప్రయత్నం ఎట్టకేలకు ఈ వరల్డ్‌కప్‌లో ఫలించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటిసారి ఫైనల్‌కు చేరుకున్న న్యూజిలాండ్‌కు నిరాశే ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.


Also Read: 'ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.. నా కోరిక నేటికి నెరవేరింది'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.