Breaking News Live: గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తాం : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. జాతీయ జెండా ఎగుర వేసే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలుకుతామన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వ విధానం పాటుపడుతుందని ఎమ్మె్ల్యే ముస్తఫా అన్నారు. రాజకీయ లబ్ది కోసం కొన్ని పార్టీలు ఏవేవో చేస్తున్నాయన్నారు. భారతదేశం కోసం ఎందరో ముస్లిం సోదరులు ప్రాణాలు అర్పించారన్నారు. గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ ను ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ పరిశీలించారు.
కడప నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రముక్కపల్లె సమీపంలో రైల్వే గేటు వద్ద ఇద్దరు యువతులు ఆత్మహత్యయత్నం చేశారు. సుజిత అనే అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందగా మరో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న యువతిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సంఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఘటనకు పాల్పడ్డ ఇద్దరు అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రసంగించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణలో ప్రఖ్యాత ఆలయాన్ని ప్రస్తావించారు. రామప్ప ఆలయం గురించి మాట్లాడారు. రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకొచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.
గన్నవరం విమానాశ్రయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో విమానాలు ల్యాండ్ అవుతాయో లేదో తెలియక అయోమయంలో ప్రయాణికులు, అధికారులు హైరానా పడ్డారు. ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సుమారు గంటసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. చివరికి హైదరాబాద్ ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు. పలువిమానాలు కూడ మంచు కారణంగా ఆలస్యంగా నడిచాయి.
పెద్దపల్లి పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి శాంతినగర్ 2వ వార్డు కౌన్సిలర్ పస్తం హనుమంతు, సోదరుడు లక్ష్మణ్, కుటుంబ సభ్యులతో కలిసి మంచిర్యాల నుండి బొలెరో వాహనంలో పెద్దపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో గాయపడిన వ్యక్తులకు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కొరకు కరీంనగర్ ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ తనుశ్రీ (8) చిన్నారి మృతి చెందింది. శివ ప్రసాద్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.
విశాఖపట్నం నగరంలో మరోసారి డ్రగ్స్ దొరకడం కలకలం రేపింది. స్థానిక ఎన్ఏడీ జంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఒక యువతితో పాటు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిది హైదరాబాద్ కాగా, యువకుడిది విశాఖగా గుర్తించారు. టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్, 2 ఎండీఎంఏ పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమికుడు హేమంత్ కోసం ప్రియురాలు హైదరాబాద్ నుంచి డ్రగ్స్ తెచ్చినట్టు తెలుస్తోంది.
నేటి నుంచి (జనవరి 31) పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఈ ఏడాది జులైతో రాష్ట్రపతి పదవీ కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో ఆయనకు ఇదే ఆఖరి ప్రసంగం కానుంది. రాష్ట్రపతి ప్రసంగం పూర్తైన అరగంట తర్వాత లోక్‌సభ సమావేశం అవుతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్యసభ సమావేశం కానుంది.
Background
అల్పపీడన ద్రోణి దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా నేడు ఏపీలో వాతావరణం పొడిగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి గాలులలో ప్రజలు ఉదయం వేళ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోనూ చలి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.
రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. వర్ష సూచన లేకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని, కొన్ని కోట్ల పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు వర్ష సూచన లేదు. ఈరోజు, రేపు వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గడంతో రైతుల ధాన్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. సీమలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. కొన్నిచోట్ల ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. ఈశాన్యం నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ముందు రోజు తులానికి ఏకంగా రూ.150 తగ్గిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,000 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -