Breaking News Live: పెందుర్తి భూకబ్జా వ్యవహరం.. వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 30 Jan 2022 09:41 PM
పెందుర్తి భూకబ్జా వ్యవహరం.. వైసీపీ నేత దొడ్డి కిరణ్ అరెస్టు 

విశాఖ పెందుర్తి భూకబ్జా ఘటనలో రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసిన వైసీపీ నేత దొడ్డి కిరణ్ ను అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో దొడ్డి కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్టును పోలీసులు ఇంకా నిర్థారించలేదు. పెందుర్తిలో 80 సెంట్ల భూమి కబ్జా కోసం ప్రయత్నించిన్నట్టు దొడ్డి కిరణ్ పై ఆరోపణలు ఉన్నాయి. 

జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆటో-బైక్ ఢీకొని ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామ శివారులో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆటో బైక్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. మృతులు నూకపల్లి అర్బన్ కాలనీకి చెందిన వలస కూలీలుగా సమాచారం. 

హనుమకొండ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం

హనుమకొండ హెచ్ డీఎఫ్ సి బ్యాంక్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్యాంక్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి దీంతో పొగ దట్టంగా అలముకుంది. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.  ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. 

‘రెవిన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై బీజేపీ రౌండ్ టేబుల్ సమావేశం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవిన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ సైనికాధికారుల, స్వాతంత్య్ర సమరయోధులు, భూ బాధితుల సంఘం నాయకులతోపాటు వివిధ సంఘాలకు చెందిన సాంకేతిక నిపుణులు రెవెన్యూ చట్టాలు-ధరణి లోపాలను వివరించారని ఎంపీ బండి సంజయ్ తెలిపారు.

అనంతపురం: గజ దొంగ అరెస్టు

తాళం వేసిన ఇళ్లల్లో సులువుగా చోరీలకు పాల్పడిన హౌస్ బ్రేకర్ ను అనంతపురం నాలుగవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుండి 24 లక్షల విలువచేసే 52 .46 తులాల బంగారు నగలు 800 గ్రాముల వెండి ఆభరణాలు ద్విచక్ర వాహనం 2 సెల్ ఫోన్లు రాడ్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర పల్లి గ్రామానికి చెందిన ఉప్పర ఆది శ్రీనివాసులు పేకాట తదితర వ్యసనాలకు బానిసై.. దొంగగా  అవతారమెత్తినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత ఏడాది జనవరి నెల నుండి ఇప్పటి వరకు అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లోని 29 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప ఆదేశాల మేరకు అదనపు ఎస్.పి నాగేంద్రుడు అనంతపురం ఇంచార్జి బీఎస్పీ ప్రసాద్ రెడ్డి నాలుగవ పట్టణ సీఐ కత్తి శ్రీనివాసులుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరిలో ప్రమాదం జరిగింది. లారీ-టాటా సుమో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పాహిల్వాన్‎పురం గ్రామానికి చెందిన రేపాక నర్సింహగా పోలీసులు గుర్తించారు.

కరీంనగర్‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మహిళలు దుర్మరణం

కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కమాన్ చౌరస్తా నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో కల్వర్టు వద్ద గల సీస కమ్మరి పని చేసుకునే వారి పైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మహిళలు మృతి చెందారు.  TS02 EY 2121 నంబర్ గల హ్యుండాయ్ క్రెటా కారు వారిపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Background

ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగా కంటే మరింత తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాలు సహా.. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాగల మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ప్రస్తుతం తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలుల ప్రభావంతో రాష్ట్రమంతా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. 


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ వివరాలపై ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ కూడా కీలక అంచనాలను వెల్లడించారు. శీతల గాలుల ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలి అధికంగా ఉంటుందని చెప్పారు. ‘‘విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత తీవ్రంగా ఉంటుంది. ఈ చలి తెల్లవారిజామున సమయంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోకి విస్తరిస్తుంది కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరో వైపున విశాఖ నగరంలో సాధారణంగానే చలి ఉంటుంది.


తెలంగాణ రాష్ట్రం మొత్తం చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది. వాటి ప్రభావం వల్ల గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో తెలంగాణకి ఎంత దగ్గరగా మీ ప్రదేశం ఉంటుందో అంత చల్లగా ఉంటుంది. అనంతపురం, చిత్తూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాయలసీమ మిగిలిన భాగాల్లో చలి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాధారణంగానే చల్ ఉంటుంది. కర్నూలు జిల్లాలో మాత్రం నంధ్యాల డివిజన్ లో చలి తీవ్రంగా ఉంటుంది.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు.


బంగారం, వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు తగ్గింది. తులానికి ఏకంగా రూ.150 తగ్గింది. వెండి ధర కిలోకు రూ.800 తగ్గుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.800 తగ్గి రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.