Breaking News Live: శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 27 Jan 2022 06:15 PM
శంషాబాద్ లో మద్యం మత్తులో కారు నడిపిన యువతి.. ముగ్గురికి తీవ్రగాయాలు 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువతి రోడ్డుపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారును స్థానికులు అడ్డుకోవడంతో వారితో యువతి, కారులోని మరో వ్యక్తి వాగ్వాదానికి దిగారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతి, ఆమెతో ఉన్న వ్యక్తిని పోలీసు స్టేషన్ కు తరలించారు. కారులో ఉన్న వారు మద్యం తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే  నందమూరి బాలకృష్ణ కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతించారు. అయితే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాల ఏర్పాటును రాజకీయం చేయొద్దని ఆయన కోరారు. 

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, హోంఐసోలేషన్ లో  ఉన్నానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

ఎమ్మెల్సీ కవితతో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భేటీ 

నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, సహకరించిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

పాత రథం చక్రాల దగ్దంపై అధికారుల వివరణ

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పాత రథం చక్రాల దగ్దంపై ఆలయ అసిస్టెంట్ కమీషనర్ కుసుమ వివరణ ఇచ్చారు.. కాణిపాకం ఆలయంలో ఆస్తులు, రధాలు భధ్రంగా ఉన్నాయని, ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల తరువాత సంబంధిత షెడ్లల్లో‌ పెట్టి జాగ్రత్త పరిచామని ఆలయ ఏసీ కుసుమ వెల్లడించారు.. దేవస్ధానం ఆస్తులకు ఎటువంటి నష్టం జరగలేదన్నారు.. దేవస్ధానంకు అర్ధ కిలో మీటరు దూరంలోని అనవసర వస్తువులు భద్ర పరుచు గ్యారేజ్ లో ఉపయోగంలో లేని ఇనుప వస్తువులు, కొయ్యలు నిల్వ ఉంచామని, చెత్త సేకరించే కొందరు ఇనుప కడ్డీల కోసం తుప్పు పట్టిన రధం చక్రాలకు నిప్పు అంటించడం జరిగిందన్నారు.‌. దీనిని గమనించిన ఆలయ సెక్యూరిటీ సిబ్బంది వేంటనే స్పందించి నిప్పును ఆర్పి వేయడం జరిగిందని, దేవస్ధానం ఆస్తులకు ఎటువంటి నష్టం జరగలేదని ఆమె వెల్లడించారు.

డ్రగ్స్ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. టోనీ దగ్గర నుంచి వ్యాపారవేత్తలు కొన్నేళ్లుగా డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ... లావాదేవీలన్నీ డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. టోనీ తన సెల్ ఫోన్‌లో ఉన్న డేటాను, వాట్సాప్ చాటింగ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు. టోనీకి సంబంధించిన రెండు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

అన్నపై తమ్ముడు కత్తితో దాడి

హైదరాబాద్‌లో ఇద్దరు అన్నాదమ్ముళ్ల మధ్య చిన్న విషయంలో గొడవ ప్రాణాలు తీసుకొనే వరకూ వెళ్లింది. అన్నపై తమ్ముడు కత్తితో దాడిచేశాడు. నగరంలోని జమాల్‌బండ ప్రాంతానికి చెందిన జావిద్‌ (26), ఆసిఫ్‌ అన్నాదమ్ములు. వీరు ఫంక్షన్‌హాల్‌లో పనిచేస్తుంటారు. వీరు సెల్‌ఫోన్‌ విషయంలో గొడవ పడ్డారు. కోపోద్రిక్తుడైన తమ్ముడు ఆసిఫ్‌ అన్న జావిద్‌పై కత్తితో దాడిచేశాడు. అక్కడే ఉన్న కొంత మంది గాయపడ్డ జావిద్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జావిద్‌కు స్వల్ప గాయాలయ్యాయని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చాంద్రాయణ గుట్ట పోలీసులు తెలిపారు.

Background

ఏపీలో నేడు, రేపు వర్ష సూచన ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీ వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు దక్షిణ తమిళనాడు నుంచి దక్షిణ మధ్య కర్ణాటక వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండే అవకాశం ఉంది. 


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఈ రోజు నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అయితే, తీవ్ర వర్షాలకు సంబంధించి ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు.


తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం నిర్మలంగా ఉండడంతో పాటు ఉదయం సమయంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా.. 29 డిగ్రీల సెల్సియస్‌గా.. 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంటుంది. నైరుతి దిశ ఉపరితల గాలులు ఉండనున్నాయి. వీటి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వరకూ వీచే అవకాశం ఉంది. 


హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిన్న అత్యల్ప ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో 10.7 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాత హకీంపేట, నిజామాబాద్, మెదక్, రామగుండం ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రత 14.5 డిగ్రీలుగా గుర్తించారు. నల్గొండలో చలి తక్కువగా ఉందని అక్కడ 18.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ అధికారులు గుర్తించారు.


బంగారం, వెండి ధరలు


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు ఎగబాకింది. తులానికి ఏకంగా రూ.150 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.300 పెరుగుదల కనిపించింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.300 పెరిగి రూ.68,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,900 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,500గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.