Breaking News Live: నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘటన స్థలంలోనే ముగ్గురు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కడెం నుంచి బోర్ణపల్లి వైపు ఆరుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి కాలువలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
కోవిడ్19 బారిన పడి చనిపోయిన వారి కుటుంబసభ్యులకు పరిహారం చెల్లించనందుకు ఆంధ్రప్రదేశ్ మరియు బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీంకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఇద్దరు ప్రధాన కార్యదర్శులను నేటి మధ్యాహ్నం 2 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్-19 మరణాలకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ఇస్తుండగా.. ఏపీ, బిహార్‌లో ఎందుకు తక్కువగా చెల్లిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. మీపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి పూనం కౌర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. చేనేతపై జీఎస్టీ తీసివేయాలని శ్రీవారిని కోరుకునన్నని తెలిపారు. కంచిలో చేనేత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సభ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు చెప్పారు. వైకుంఠ ద్వారా దర్శనం మొదటి సారి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నా కోరిక నెరవేరితే మెట్ల మార్గం గుండా తిరుమలకు నడుచుకుంటూ వస్తానని అన్నారు.
తిరుపతి : కుప్పంలో భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి యువకుడు పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా, కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి భవనం పైనుంచి దూకి యువకుడు బలవన్మరణం చెందాడు. కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతుడు కుప్పం లక్ష్మీపురానికి చెందిన విజయ్ ఆచారి(30)గా గుర్తించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి, ఆయన భార్య, వరంగల్ జడ్పీచైర్ పర్సన్ జ్యోతికి కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లాలో పంట నష్టంపై మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు గండ్ర దంపతులు కూడా పర్యటించారు. ఆపై మంత్రులతో నర్సంపేట నుంచి హెలికాప్టర్లో గండ్ర దంపతులు హైదరాబాద్‌కు కలిసి వెళ్లారు. అయితే జ్వరం రావడంతో పరీక్షించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. మరోవైపు భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్‌తో పాటు భూపాలపల్లి ఎస్సైకి కరోనా పాజిటివ్‌గా తేలింది.
కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం ఆకుసాయి పల్లె మూలమలుపు వద్ద అదుపు తప్పి బండ రాళ్లను బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్‌పై నుండి కందుల హరీష్, రాజ్ కుమార్ అనే వ్యక్తులు కిందపడి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందారు. తిప్పన పేటకి లింగం సురేష్ అనే మూడో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Background
ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ వి.పొట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్‌లో కేసు నమోదు అయింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు పీవీపీపై కేసు పెట్టారు. తన ఇంటి గోడను పీవీపీ అనుచరులు బలవంతంగా కూలగొట్టించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పీవీపీ అనుచరులు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ - 7లో ఓ విల్లాను డీకే అరుణ కుమార్తె శ్రుతి రెడ్డి కొనుగోలు చేశారు. ఆ ఇంటికి మరమ్మతులు చేయించడంలో భాగంగా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. అయితే శ్రుతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి ప్రహరి గోడతో పాటు రేకులను కూడా పీవీపీ అనుచరుడు బాలాజీ, ఇంకొంత మంది ఆయన అనుచరులు జేసీబీతో కూల్చేయించారని శ్రుతి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదేంటని నిలదీసినందుకు శ్రుతి రెడ్డిపై వారు బెదిరింపులకు పాల్పడినట్లుగా చెప్పారు. దీంతో పీవీపీతో పాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ, అతనికి సహకరించిన మరికొందరిపై కేసు నమోదు చేసినట్లుగా బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.
బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి స్వల్పంగా గ్రాముకు రూ.2 తగ్గింది. కానీ వెండి ధర మాత్రం కిలోకు రూ.300 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,070 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.300 పెరిగి రూ.65,800గా అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర నిలకడగానే ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,970 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,070గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,800గానే ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది నెలలుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటుండగా.. నేడు (జనవరి 19) స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు పెరిగి రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు నేడు రూ.0.17 పైసలు తగ్గి రూ.109.76 గా ఉంది. డీజిల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.96.07 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్వల్పంగా తగ్గాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.08 పైసలు పెరిగి రూ.110.37గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.08 పైసలు పెరిగి రూ.96.44 గా ఉంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు కాస్త ఎక్కువే పెరిగింది. లీటరు ధర రూ.0.60 పైసలు పెరిగి రూ.109.65 గా ఉంది. డీజిల్ ధర రూ.0.56 పైసలు పెరిగి రూ.95.74గా ఉంది. అయితే, ఇక్కడి కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -