Breaking News Live: పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పార్లమెంట్‌లో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్లు సమాచారం. పక్కనే ఉన్న సహచర ఎంపీలు వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్ దగ్గర, డీజిల్ ఖాళీ ట్యాంకర్ ను గ్యాస్ వెల్డింగు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు ,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు, డ్రైవర్ షఫీ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ రోడ్డు ప్రమాదం కేసులో ఖాసిం అనే వ్యక్తిని ఎస్సై, సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
విశాఖ: రివర్స్ పీఆర్సీతో పాటు ఉద్యోగుల గృహ నిర్భందాలు, అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా జగదాంబ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. CITU ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు, కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలను వంచించిందంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పోలీసులు వారిని ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు.ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్యా వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు CITU నేతలను అరెస్ట్ చేయడం తో విశాఖ జగదాంబ సెంటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం యాదాద్రిని సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన యాదాద్రికి వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ 3 నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా ఆలయం, యాగస్థలాన్ని పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శనం చేసుకున్న కేసీఆర్.. ఆపై ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు.
మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు 3,845 బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఈడీ మునీశ్వర్ తెలిపారు. మేడారం జాతరకు ఆర్టీసీ ఏర్పాట్లపై సోమవారం మునీశ్వర్ మీడియాతో మాట్లాడారు. జాతరకు బస్సుల్లో 21 లక్షల మందిని తరలించడమే ఆర్టీసీ లక్ష్యమని అన్నారు. ఇతర జిల్లాలకు చెందిన బస్సులను కూడా వరంగల్ నుండి మేడారంకు నడుపుతున్నామని తెలిపారు. మేడారంలో భక్తులను జంపన్న వాగుకు తరలించడానికి తొలిసారి మినీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో, 42 క్యూ లైన్స్ ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఈడీ మునీశ్వర్ పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా కీసర వద్ద ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేశాడు. బస్సు తన మీదకు వచ్చిందంటూ డ్రైవర్‌తో వాదనకు దిగి, చేతిలో ఉన్న క్యారేజ్‌తో డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు,చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
నెల్లూరు పోలీస్ గ్రౌండ్‌లో మహిళా పోలీస్ యూనిఫామ్ సైజులు తీసుకోవడానికి పురుష పోలీస్ లని డ్యూటీ వేయడం కలకలం రేపుతోంది. మహిళల డ్రెస్సు కొలతలు పురుషులు తియ్యడమేంటి, అమ్మాయిలం చాలా ఇబ్బంది పడతా ఉన్నాం అని లేడీ కానిస్టేబుల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో యూనిఫామ్ కొలతలు పోలీసులు తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్ లకు ఈరోజు యూనిఫామ్ కొలతలు తీసుకుంటున్నారు. ఫొటోలు బయటకొచ్చిన తర్వాత కూడా మగవారితోనే కొలతలు తీస్తున్నారని, వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ అమర్చిన పేలుడు పదార్థాలు పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించి ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ వివరాలు వెల్లడించారు. వీటిలో ప్రెజర్ కుక్కర్ -1,
కార్డేక్స్ వైర్ 20 మీటర్లు, డిటోనేటర్లు 2, బ్యాటరీ లు -33, మదర్ బోర్డులు, కండెన్సర్లు, కెమెరా ప్లాష్, వైర్ బెండలు 3, ఇతర వస్తువులు ఉన్నాయని వివరించారు.
సిద్దిపేట కాల్పుల ఘటనలో నిందితులు అరెస్టు అయ్యారు. కాల్పులు, చోరీ కేసులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు రాజు(26), మరోవ్యక్తి పట్టుబడ్డారు. జనవరి 31న సిద్దిపేట రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపి నగదు ఎత్తుకెళ్లారు.కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.42 లక్షలను దోచుకెళ్లారు.
శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమలకు రానున్నారు. 9వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతిలో జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు. అటు తరువాత సాయంత్రం తిరుమలకు పద్మావతి అతిథి గృహంలో రాత్రి వెంకయ్య నాయుడు బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం 10వ తేదిన శ్రీవారి సేవలో వెంకయ్య నాయుడు దర్శించుకోనున్నారు. దర్శనంతరం మధ్యాహ్నం తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు వెంకయ్య నాయుడు తిరిగి వెళ్ళనున్నారు.
కుమ్రం భీం జిల్లాలోని సిర్పూర్‌లో ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. విగ్రహాలతోపాటు, హుండీలో సొత్తును కూడా దుండగులు కొల్లగొట్టారు. సిర్పూర్‌లోని వెంకటేశ్వర ఆలయంలో పంచలోహ విగ్రహాలు, హుండీలోని సొత్తును దొంగలు దోచుకొని వెళ్లారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మెట్ పల్లి రోడ్డులో ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్రిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని మంటలార్పారు. ఈ ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక యువత సహాయంతో మంటల్లో కాలిపోతున్న బైక్ లను హుటాహుటిన బయటకు తీశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేడు ముచ్చింతల్ సందర్శించనున్నారు. త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఆరో రోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొదటగా దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం నిర్వహిస్తారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ చేస్తారు. వీటితో పాటు ప్రముఖులతో ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ మరోసారి పరిశీలించనున్నారు. మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పనుల పురోగతిని సీఎం కేసీఆర్ మరోసారి స్వయంగా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లను అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే, ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Background
తెలుగు రాష్ట్రాల్లో చలి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో చలి తీవ్రత అధికంగా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జంగమేశ్వరపురం, నందిగామ, కళింగపట్నం పరిసర ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ ఎత్తులో తూర్పు దిశ నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
నేడు కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చలి తగ్గుముఖం పట్టనుంది. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. జంగమేశ్వరపురంలో 15.2 డిగ్రీలు, కళింగపట్నంలో 15.8 డిగ్రీలు, నందిగామలో 16.3 డిగ్రీలు, బాపట్లలో 18.7, అమరావతిలో 18.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం సాధారణంగా ఉంటుంది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.3 డిగ్రీలు, కర్నూలులో 18.9 డిగ్రీలు, కడపలో 21.6 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం సాధారణంగా ఉండనుంది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం ఇలాగే పొడిగా ఉండనుంది.
బంగారం వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు కూడా స్థిరంగా ఉంది. వెండి ధరలో కిలోకు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -