Breaking News Live: చలో విజయవాడకు పోలీసుల అనుమతి నిరాకరణ
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈనెల 3వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి విజయవాడకు రావొద్దని సూచించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో చలో విజయవాడ నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణలో యువతు, ఉద్యోగులకు మేలు చేసేలా జీవో 317 తీసుకొచ్చాం: కేసీఆర్
కొందరు స్వార్థపరులైన ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు: కేసీఆర్
ఇలా వ్యతిరేకించేవాళ్ల గూబ పగలకొట్టండి: కేసీఆర్
ఈ జీవో ప్రకారం చాలా మంది జాయిన్ అయ్యారు: కేసీఆర్
ఇంకా 57మంది జాయిన్ కాలేదు: కేసీఆర్
వాళ్ల కోసం కొందరు ఉద్యమం అంటున్నారు: కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వచ్చేది గుండు సున్నా : కేసీఆర్
భారత దేశాన్ని సాకుతున్న రెండు మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి: కేసీఆర్
తెలంగాణ నుంచే కేంద్రానికి ఎక్కువ వెళ్తోంది: కేసీఆర్
ఎనిమిదేళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు రైతు బంధుకు సమానం కాదు: కేసీఆర్
ఈ కేంద్ర ప్రభుత్వానికి ఓ పాలసీ లేదు. దేశానికి గోల్‌మాల్ చేసేందుకు ఇంకో బోగస్ పథకం ప్రకటించారన్నారు కేసీఆర్. జల్‌శక్తి మిషన్ అనేది మోసమని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పథకానికి అరవై వేల కోట్లు ఎలా కేటాయించారని నిలదీశారు. ఈ అమౌంట్‌తో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
క్రిఫ్టో కరెన్సీని అంగీకరించకుండా 30శాతం పన్ను ఎలా వేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు కేసీఆర్.
నదుల అనుసంధానం పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ఎలా చేస్తావని ప్రధాన మంత్రిని ప్రశ్నించారు కేసీఆర్. తెలుగు రాష్ట్రాలకు హక్కు ఉన్న నదులను మీరు ఎలా అనుసంధానం చేస్తారని నిలదీశారు. అందుకే నదుల అనుసంధానం అనేది మిలీనియం జోక్‌గా అభివర్ణించారు కేసీఆర్.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్ వస్తుందంటే ప్రధాని తట్టుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. దాన్ని పడగొట్టేందుకు శిఖండి లాంటి గిఫ్ట్ సిటీ అనే కాన్సెప్ట్‌ను అహ్మదాబాద్‌లో పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ చేసిన పనిని పొగడాల్సింది పోయి శిఖండిని తీసుకొస్తున్నామంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం
కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి సిగ్గూశరం లేదన్నారు కేసీఆర్. భారత్ అభివృద్ధి చెందాలంటే బీజేపీని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని దింపేందుకు ఉద్యమిస్తామన్నారు.
ప్రధానమంత్రి మోదీ చాలా కురచ బుద్ది ఉన్న వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
లాభాల్లో ఉన్న ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అమెరికాలో ఉన్న వారికి బ్రోకర్లుగా పని చేస్తున్నారా అంటూ నిలదీశారు.
2022కి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు ఏమందైన్నారు కేసీఆర్. అన్ని ధరలు పెంచి రైతు పెట్టుబడిని మాత్రం డబుల్ చేస్తున్నారని మండిపడ్డారు.
అందరికీ ఇళ్లు అన్నది ఏమైందో చెప్పాలని నిలదీశారు కేసీఆర్. బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తామని మనిషికి పదిహేను లక్షలు ఇస్తామని చెప్పిన మాట సంగతి ఏంటని మోదీని ప్రశ్నించారు తెలంగాణ సీఎం.
భవిష్యత్‌లో కరోనా లాంటి వైరస్‌లు విజృంభించ వచ్చని అంచనాలు ఉన్నా కేంద్రం వైద్యారోగ్యశాఖకు పైసా పెంచలేదని విమర్శించారు కేసీఆర్. బ్యాంకులను అప్పుల్లో ముంచిపోయిన వాళ్లకు సబ్సిడీలు ఇస్తారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇస్తారు రాయితీలు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడం... మత పచ్చి లేపి మందిమీద పడి ఏడ్చి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని కేసీఆర్ మండిపడ్డారు.
ప్రపచం ఆహార సూచిలో మనది అధ్వాన్నంలో ఉన్నామని... పాకిస్థాన్, నేపాల్ కంటే వెనుకబడి ఉన్నాం. 115 దేశాల్లో సర్వే చేస్తే 101లో భారత్ ఉందన్నారు కేసీఆర్. అంటే మోదీ ఏం చేస్తున్నాట్టో చెప్పాలన్నారు కేసీఆర్
అత్యంత దారుణమైన విద్యుత్ పాలసీ అమలు చేస్తున్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. గుజరాత్ మోడల్ పేరుతో మోదీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎనభై శాతం కాలం పరిపాలించిన మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైపోయింది.
కరోనాతో దేశం అల్లకల్లోలమైపోయింది. లక్షల మంది ప్రజలు కనీసం రైలు టికెట్ కూడా ఇవ్వలేదు. నడుచుకుంటూ వెళ్తూ వేలమంది చనిపోయారు. అయినా ప్రభుత్వం ఏ మాత్రం సాయం చేయలేదు.
ఎస్సీ, ఎస్టీల జనాభాపై కేంద్రం చెప్పిన లెక్కలు తప్పు అన్నారు కేసీఆర్. తమ బడ్జెట్‌లో వాళ్లకు ఖర్చు పెట్టినంత కూడా కేంద్రం వాళ్లకు కేటాయించలేదన్నారు.
ఆందోళన చేసిన రైతుల ప్రస్తావనే బడ్జెట్‌లో లేదని కేసీఆర్ ఆక్షేపించారు. ఎరువులపై 35. 900 కోట్ల రూపాయలు తగ్గించారు. ఇదే ప్రధానమంత్రి రైతులకు ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించారు. గ్రామీణ ఉపాధి హామీపై పాతికవేల కోట్లు కోత పెట్టారని మండిపడ్డారు.
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలా దారుణమైన బడ్జెట్ అన్నారు సీఎం కేసీఆర్. బడ్జెట్ పెట్టేటైంలో మహాభారతంలోని శాంతి పర్వంలోని ఓ శ్లోకాన్ని ఆర్థికమంత్రి కోట్ చేశారని గుర్తు చేశారు. ప్రజలు బాగుండాలని దాని అర్థమని కేసీఆర్ చెప్పారు. ఆమె శాంతి పర్వంలోని శ్లోకం చెప్పి... అసత్యాలే చదివారని మండిపడ్డారు కేసీఆర్
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కేంద్ర బడ్జెట్ 2022-23లో రూ.40 కోట్ల కేటాయించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.50 కోట్ల కేటాయించారు.
ఏపీలో పీఆర్సీ అంశంపై మంత్రులతో కూడిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీతో ఉద్యోగాల భేటీ సమావేశం అయింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అయితే ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఇప్పటికే పలు మార్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను కోరింది. ఉద్యోగ నేతలతో పలు అంశాలపై ఈ స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు.
హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్‌నకు గురయ్యారు. నాంపల్లిలోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా అనే 60 ఏళ్ల రియల్టర్‌ని గుర్తు తెలియని వ్యక్తులు గత అర్ధరాత్రి 12:10 గంటలకు కిడ్నాప్ చేశారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోఠి ఈడెన్ గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈయన నిన్న ఈడెన్ గార్డెన్స్‌లో ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో పాషాను ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లో నిజాంపేట రోడ్డులోని శ్రీశ్రీ హోలీస్టిక్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి అంతస్తులో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక రోగులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పాయి. ఆ అంతస్తులో దాదాపు 30 మంది రోగులు ఉన్నట్లు తెలుస్తోంది. ఐసీయూ వార్డులోని రోగులను సెక్యూరిటీ గార్డులు భుజాలపై వేసుకుని బయటికి తీసుకొచ్చి వేరే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రోగులతోపాటు, వైద్య సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు పెట్టారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ పోలీసులు ఆస్పత్రిని సందర్శించారు.
Background
తెలంగాణలో నేటి నుంచి అన్ని స్కూళ్లు, కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. కరోనా కేసుల ప్రభావంతో అన్ని విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలను తెరుస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ స్కూళ్లు తెరవాలని స్కూల్, హైయర్ ఎడ్యూకేషన్ విభాగాలకు ఆదేశాలు ఇచ్చారు. తొలుత సంక్రాంతికి ఇచ్చిన సెలవులను కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ఈనెల 30 వరకు పొడిగించాల్సి వచ్చింది. మరోవైపు, విద్యా సంస్థల్లో 15 నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని వైద్యశాఖకు సూచించింది. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో టీవీ, ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి.
వాతావరణం
ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం సాధారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్రలో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
రాయలసీమలోనూ వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -