Breaking News Live: పల్లె వెలుగు బస్సుల రంగులు మార్చాలని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 06 Dec 2021 03:53 PM
పల్లె వెలుగు బస్సులు రంగులు మార్చాలని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగులను మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలను జారీచేశారు.  ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు. ఇదే సమయంలో డిజైన్ ను కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. 

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురి దుర్మరణం

కర్ణాటకలోని ఉలిగిలో దేవస్థానానికి వెళ్లి వస్తున్న వారు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి వద్ద చోటుచేసుకుంది. వీళ్లంతా బ్రహ్మసముద్రం మండలం కోడిపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మృతిచెందిన వారిలో ఆటో డ్రైవర్ శేఖర్, మహేంద్ర, నాగమ్మ, రక్షిత ఉండగా రాము, రూప, లక్ష్మి, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిలున్నట్లు పోలీసులు గుర్తించారు.

భద్రాద్రి రామయ్యకు మంత్రి కొడాలి స్వర్ణ కిరీటం బహూకరణ

ఆంద్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని దంపతులు భద్రాద్రి రాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రూ.13 లక్షల విలువ గల స్వర్ణ కిరీటాన్ని వారు స్వామి వారికి సమర్పించారు. కొడాలి నాని దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. వారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రెటరీ నర్సింగ రావు, వరంగల్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర ఆర్&బి ప్రిన్సిపల్ సెక్రటరీ కె.ఎస్ శ్రీనివాస రాజులు దర్శించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో వీరికి వేదపండితులు ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు‌, స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగ రావు అన్నారు.

తిరుమల వెంకన్నను దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్

తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ‌ సమయంలో మిత్రులతో కలిసి స్వామి వారి మూలవిరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు మంత్రి కొప్పుల దంపతులకు వేదాశీర్వచనం అందించగా, టిటిడి‌ ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెంకన్నను దర్శించుకోవడంతో తనలో మనోస్థైర్యంతో పాటు తన మనసుకి ఆనందాన్ని కలిగించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అబివృద్దిలో మొదటి స్థానంలో ముందుకెళ్తోందని తెలిపారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.

జీహెచ్ఎంసీలో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ నెల 8న నీటి సరఫరా నిలవనుంది. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు మంచినీటి సరఫరా ఉండదని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్‌పీ) ఫేజ్‌-1కు సంతో‌ష్‌నగర్‌ వద్ద వాటర్‌బోర్డు ఆధ్వర్యంలో జంక్షన్‌ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, మీరాలం, కిషన్‌బాగ్‌, చంచల్‌గూడ, అస్మాన్‌గఢ్‌, అల్‌ జుబైల్‌ కాలనీ, సంతో‌ష్‌నగర్‌, మన్నెగూడ, వినయ్‌నగర్‌, సైదాబాద్‌, మాదన్నపేట, మహబూబ్‌ మాన్షన్‌, యాకూత్‌పురా,  చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌, బొంగుళూరు, రియాసత్‌నగర్‌, ఆలియాబాద్‌, బొగ్గులకుంట, శివం, నల్లకుంట రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటి సరఫరా ఒకరోజు నిలవనుంది.

Background

మానుకోటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మాస్కు, హెల్మెట్ తప్పనిసరి అంటూ ఆదివారం మహబూబాబాద్ జిల్లా మానుకోటలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ వివాదాస్పదంగా మారింది. బైకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన కూతురితో మహబూబాబాద్‌‌లో కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో కురవి గేట్ సమీపంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.


ఈ సమయంలో అదే మార్గం గుండా వెళ్తోన్న శ్రీనివాస్‌ను పోలీసులు ఆపి బండితాళం లాక్కున్నారు. తాళం ఎందుకు తీసుకున్నారని అడిగితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నావని తిట్టారని, దానికి ఫైన్ కడుతానని చెప్పినా వినిపించుకోకుండా ఎదురు సమాధానం చెప్పానని రోడ్డుపైనే విపరీతంగా కొట్టారని సదరు ద్విచక్ర వాహనదారుడు వాపోయాడు. అయితే, పోలీసులు శ్రీనివాస్‌ని కొడుతున్న సమయంలో పక్కనే ఉన్న అతని కూతురు ‘ప్లీజ్ మా డాడీని కొట్టొద్దు’ అని పోలీసుల ఎదుట వెక్కి వెక్కి ఏడ్చింది. కూతురు రోదించడం చూసిన శ్రీనివాస్ పోలీసుల తీరుకు నిరసిస్తూ రోడ్డుపైనే బైటాయించి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఉదంతం మొత్తం స్థానికులు వీడియోలు తీసి, సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేయగా, అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు దిగివచ్చి క్షమాపణ కోరారు.


తిరుమల ఘాట్‌ రోడ్లను పరిశీలించిన కేరళ టీమ్
ఇటీవల వర్షాలకు ఘాట్‌ రోడ్డులో విరిగిప‌డిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత  విశ్వవిద్యాల‌యం నుండి వరల్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ల్యాండ్‌స్లైడ్ డిజాస్టర్ రిడక్షన్ కింద అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ చేస్తున్న నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండ చరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది. ల్యాండ్‌స్లైడ్స్ నిపుణులు కొండ‌చ‌రియ‌లు విరిగిన ప్రాంతంలో పున‌రుద్ధర‌ణ ప‌నులు, భ‌విష్యత్తులో ఇలాంటివి జ‌ర‌గ‌కుండా అత్యాధునిక శాస్త్రా ప‌రిజ్ఞానం ఉప‌యోగించుకొని స‌మ‌గ్ర స‌ర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో నిలకడగానే ధరలు ఉంటున్నాయి. ఇక వరంగల్‌లోనూ నేడు ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.69 అయింది. డీజిల్ ధర రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. లీటరుకు రూ.0.20 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.110.71 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.19 పైసలు తగ్గి రూ.96.77గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.


వాతావరణ వివరాలు
ఏపీకి జవాదు తుపాను ముప్పు తప్పినా.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ఉత్తర ఒడిషా తీరానికి దగ్గరగా 70 కి.మీ దూరంలో, తూర్పు-ఈశాన్య చాంద్‌బాలీకి 65 కి.మీ దూరంలో తూర్పు-ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. మరో 6 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలహీన పడనుందని భారత వాతావరణ కేంద్రం సోమవారం తెల్లవారుజామున వెల్లడించింది. జవాద్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడినా మరో రెండు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నిన్న పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ  ప్రాంతం, ఒడిశా తీర ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని ప్రభావితం చేశాయి. దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో మంగళవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.