Breaking News Live: నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం.. ఎంపీ భరత్ రామ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 28 Dec 2021 12:18 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్

కడప జిల్లా: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో వేరే వారి పేర్లను చెప్పాలని తనపై ఒత్తిడి పెరుగుతోందని.. పులివెందుల పోలీసులు, ఎస్పీలకు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. కదిరి లాయర్ లోకేశ్వర్ రెడ్డి ద్వారా సీబీఐ ఏఎస్పీ అధికారి రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ఫిర్యాదు చేశారు. వీరికి మద్దతుగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలు వేరే పేర్లు చెప్పాలని.. కేసు విచారణకు వచ్చిందని.. త్వరగా వేరే వారి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా కృష్ణారెడ్డి చెప్పినట్లు లాయర్ లోకేశ్వర రెడ్డి, మరో కడప లాయర్ అనంత వర ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.

నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం.. ఎంపీ భరత్ రామ్

నరసాపురం ఎంపీ రఘురామ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారని.. తాము రూ. 125 కోట్లతో రాజమహేంద్రవరం సమగ్రాభివృద్ధికి శ్రీకారం చేపడుతున్నామని రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ అన్నారు. రాజమహేంద్రవరానికి మణిహారంలా రాజానగరం నుంచి  కడియపు లంక వరకు పది కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ప్రమాదాలకు కేంద్రంగా నిలుస్తున్న రాజమండ్రి హుకుంపేట జంక్షన్, జొన్నాడ సెంటర్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

ఏపీలో 12 పథకాల్లో 9.3 లక్షల మందికి రూ.702 కోట్లు విడుదల

వైఎస్సార్ చేయూత పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. పలు పథకాలలో అర్హులైన వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 12 పథకాల్లో 9.3 లక్షల మందికి రూ.702 కోట్లు విడుదల చేశారు. కుల, మత, పార్టీ అనే భేదాలు లేకుండా అర్హులైన అందరికీ ప్రయోజనాలు అందుతాయన్నారు. ప్రస్తుతం 61 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు.

శ్రీవారి సేవలో ‘ఇందువదన’ టీం

తిరుమల శ్రీవారిని‌ ఇందువదన మూవీ టీం దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి‌ నైవేద్య విరామ సమయంలో సినీనటుడు వరుణ్ సందేశ్ తో పాటుగా ఇందువదన మూవీ బృందం స్వామి వారి సేవలో పాల్గోని‌ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీ నటుడు వరుణ్ సందేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇందువదన చిత్ర బృందంతో కలిసి స్వామి వారి సేవలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందన్నారు.. తను కథానాయకుడిగా నటించిన ఇందువదన సినిమా జనవరి 1వ తేదీ విడుదల కానుందని,‌ సినిమా విజయవంతం కావాలని శ్రీనివాసుడిని ప్రార్ధించినట్లు తెలిపారు. డైమండ్ రాజా అనే నూతన సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తున్నట్లు వరుణ్ సందేశ్ తెలియజేశారు..

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం

రాజేంద్రనగర్: హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టిన కారు, ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు, వారి పరిస్థితి విషమం
శంషాబాద్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ప్రమాదం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు
కారులో 6 మంది యువకులు, మద్యం సేవించి కారు నడుపుతున్నట్లు గుర్తింపు, కారులో మద్యం బాటిళ్ల స్వాధీనం

హైదరాబాద్ ఫ్లైఓవర్ ప్రారంభం నేడు

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఓవైసీ - మిథాని జంక్షన్‌లో రూ.80 కోట్లతో నిర్మించిన వంతెన నేడు ప్రారంభం కానుంది. దీనిని మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. చార్మినార్‌ జోన్‌లో ఇది మొదటి ఎస్‌ఆర్‌డీపీ వంతెన. ఇప్పటి వరకు శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్‌ జోన్లలో మాత్రమే ఈఎస్ఆర్డీపీ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఐటీ కారిడార్‌లో రద్దీ పెరుగుతున్నందున అక్కడ వంతెనలు, అండర్‌ పాస్‌ల నిర్మాణం ఆవశ్యకం అవుతున్న సంగతి తెలిసిందే.

Background

రైతు బంధు డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో పడనున్నాయి. యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఎకరం భూమి ఉన్న రైతులకు 28న, రెండెకరాలు ఉన్న రైతులకు 29న, మూడెకరాలు ఉన్నవారికి 30న.. ఇలాగే రోజుకో ఎకరం పెంచుతూ వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 7 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.43,036.63 కోట్లు జమ చేశామని, ఈ సీజన్‌తో కలిపితే రూ.50 వేల కోట్ల మైలురాయిని చేరుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు.


వంగవీటి రాధాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకి సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2+2 గన్ మెన్ లను కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. వంగవీటి రాధాపై రెక్కీ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. 


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి జగ్గారెడ్డి ఫిర్యాదు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బైలా పాటించడంలేదని లేఖలో పేర్కొన్నారు. 


కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 12 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 56కు చేరాయి. గడచిన 24 గంటల్లో 37,839 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 182 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,80,844కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌ లో ఈ వివరాలు ప్రకటించింది. గత 24 గంటలలో కరోనాతో ఒక్కరు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 4,023కి కరోనాతో మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 181 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 3,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ రికవరీ రేటు 98.90 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.59 శాతం ఉందని బులిటెన్‌లో ప్రకటించింది. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన వారిలో 10 మందికి కొత్త వేరియంట్‌ సోకింది. వీరి కాంటాక్ట్స్ లో ఇద్దరి వ్యక్తుల్లో ఒమిక్రాన్ వైరస్‌ని గుర్తించారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో 10 మంది కోలుకున్నారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.