Breaking News Live: తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Dec 2021 09:38 PM
తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు

తెలంగాణలో కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీంతో తెలంగాణ మొత్తం ఒమిక్రాన్ కేసులు 38కు చేరాయి.  

జూబ్లీహిల్స్‌లో రెసిడెన్షియల్ ఏరియాలోని 10 పబ్‌లకు హైకోర్టు నోటీసులు

జూబ్లీహిల్స్ లో రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న 10 పబ్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో పబ్ లపై జూబ్లీహిల్స్ లోని రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 29 లోపు పూర్తి నివేదిక సమర్పించాలని పబ్ లకు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.

నా తండ్రి వదిలినా.. వారిని నేను వదలను: నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటిస్తున్న ఆయన తన తల్లిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యల అంశంపై స్పందించారు. తన తల్లిని కించపరిచిన వాళ్లను తన తండ్రి వదిలిపెట్టినా తాను మాత్రం వదలబోనని శపథం చేశారు. తమ కుటుంబాన్ని బయటికి లాగేందుకు వైసీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని అన్నారు. వచ్చే రోజుల్లో వైసీపీ నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ లోకేశ్ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రైతులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను అవమానపరచడమేనని, ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత రైతులు, వ్యవసాయం కాగా, కేంద్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యం రాజకీయాలు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణలోని 70 లక్షల మంది రైతుల తరఫున మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. కానీ పీయూష్ గోయల్ ఇవేమీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మాట తప్పింది, ధాన్యం కొనుగోలు చేయనిది కేంద్ర ప్రభుత్వమని.. రైతుల ఓట్లు కావాలి కానీ, వారు పండించే ధాన్యం మాత్రం వద్దా అని కేంద్ర ప్రభుత్వానికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

తిరుపతి... హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతి...
హాస్టల్ భవనంపై నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చంద్రగిరి మండలం, ఏ రంగంపేట సమీపంలో ఉన్న ఓ హాస్టల్ వద్ద ఘటన జరిగింది. మృతురాలు కడప జిల్లాకు చెందిన వాసంతిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రూయా ఆస్పత్రికి తరలించారు. వాసంతి తండ్రి ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

కర్నూలు జిల్లాకు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి కర్నూలుకు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. ఉదయం 11.15 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా పంచలింగాల గ్రామానికి చేరుకోనున్నారు. పంచలింగాలలో జరగనున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి తాడేపల్లికి జగన్ పయనం అవుతారు. 

ఎంఎంటీఎస్‌లో కత్తితో బెదిరింపులు

ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న రైల్వే ఉద్యోగినిని కత్తితో బెదిరించి ఓ దుండగుడు సెల్‌ఫోన్‌ దోచుకుపోయాడు. బాధితురాలు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లిలో నివాసం ఉండే మణికర్ణ బిరాదర్‌ 15 ఏళ్లుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టంలో సీనియర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోంది. రోజూ ఎంఎంటీఎస్‌లో లింగంపల్లికి వెళ్లే ఆమె సోమవారం రాత్రి విధులు ముగించుకున్న తర్వాత సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట్‌ వరకు మెట్రో రైలులో వచ్చి.. బేగంపేట్‌లో ఎంఎంటీఎస్‌ ఎక్కారు. రైలు బోరబండ స్టేషన్‌లో నిమిషం పాటు ఆగి స్టార్ట్‌ కాగానే గుర్తు తెలియని వ్యక్తి లేడీస్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కి ఆమె చేతిలోని రూ. 35 వేల విలువ గల సెల్‌ఫోన్‌ను లాక్కొని రైలు దిగి పరారయ్యాడు. దీంతో మణికర్ణ చందానగర్‌లోని ఆర్‌పీఎఫ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Background

శీతకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 29న బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. జనవరి 3 వరకు ఆయన ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించారు. రాజీవ్‌ రాహదారికి ఇరువైపులా చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. ఆయా ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విడిది సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. 


ప్రొటోకాల్‌ ప్రకారం కల్పించాల్సిన సదుపాయాలపై సీఎస్‌ మంగళవారం బీఆర్కే భవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రహదారులు-భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్‌, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌, అడిషనల్‌ డీజీ జితేందర్‌, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు.


బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు పెద్ద ఎత్తున తగ్గింది. గ్రాముకు రూ.40 వరకూ తగ్గి పది గ్రాములకు రూ.400 వరకూ తేడా కనిపించింది. వెండి ధర కిలోకు రూ.760 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,420 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,200గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,420గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,200 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,420గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,200గా ఉంది.


పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా స్థిరంగానే ఉంది. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లో ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. ఇక వరంగల్‌లో నేడు (డిసెంబరు 22)  పెట్రోల్ ధర రూ.107.69 గా స్థిరంగానే కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.94.14 గానే ఉంటోంది. రెండు రోజులుగా వరంగల్‌లో ఈ ధరలే ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లో ఇంధన ధరలు నేడు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.53 పైసలు పెరిగి రూ.110.46 గా ఉంది. డీజిల్ ధర రూ.0.49 పైసలు పెరిగి రూ.96.72 గా అయింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.75గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.35 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.95.83 గా ఉంది. ఇది రూ.0.32 పైసలు పెరిగింది. ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు పెరిగింది. లీటరు ధర ప్రస్తుతం రూ.0.13 పైసలు పెరిగి రూ.110.61 గా ఉంది. డీజిల్ ధర రూ.0.12 పైసలు పెరిగి రూ.96.68గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.