Breaking Updates Live: ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం : చంద్రబాబు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 19న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ దాడులకు పాల్పడడని, దాడులను తిప్పి కొడతామన్నారు. ప్రభుత్వం, పోలీసులు కలిసే టీడీపీ కార్యలయాలపై దాడులకు పాల్పడిందన్నారు. తాను ఫోన్ చేసినా డీజీపీ స్పందించలేదని చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో సెక్షన్ 356 అమలు అయ్యే పరిస్థితులు ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో రేపు టీడీపీ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్పాన్సర్డ్ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. డీజీపీ ఆఫీసు పక్కనే ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడులు జరుగుతుంటే డీజీపీ చేతులు కట్టుకుని ఉన్నారని ఆరోపించారు.
టీడీపీ కార్యాలయాలపై దాడులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. పోలీసులు, సీఎం ప్లాన్ చేసి దాడులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. దాడుల విషయంపై డీజీపీకి ఫోన్ చేస్తే స్పందించలేదన్నారు.
యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సీఎం కేసీఆర్ మంగళవారం యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకుని ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మార్చి 28, 2022 మహా కుంభ సంప్రోక్షణ, 8 రోజుల ముందు మహా సుదర్శన యాగం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆరు వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు. 1008 కుండలాలతో మహా సుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. సీఎం జగన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎమ్మెల్యే నివాసం ముట్టడికి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ అధికారులు, గవర్నర్ బిశ్వ భూషణ్ తో మాట్లాడారు. దాడులను వారికి వివరించారు. ఏపీకి కేంద్ర బలగాను పంపాలని చంద్రబాబు కోరారు. ఈ ఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసింది.
ఏపీలో టీడీపీ కార్యాలయలపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడులకు దిగారు. సీఎం జగన్ పై పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళనకు దిగారు. వైసీపీ కార్యకర్తలు టీడీపీ నేత పట్టాభిరామ్ ఇంటిపై దాడి జరిగింది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి దిగారు. విశాఖ టీడీపీ కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేసినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ కరపత్రాల పంపిణీకి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులపై రాళ్ల దాడికి దిగారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద చీపుర్లు, రాళ్లు, చెప్పులతో దాడికి దిగారు. వంద మందికి పైగా వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ సుధీర్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
తెలంగాణ హన్మకొండ వడ్డేపల్లి చర్చి పరిమిళ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడు రోజుల పాటు బాలికను హింసించడాన్ని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వృద్ధుడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
వైఎస్ షర్మిల ఇడుపులపాయలో తన తండ్రి ఘాట్ వద్ద ప్రార్థనలు చేశారు. రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను షర్మిల ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ సమాధి వద్దకు తల్లి విజయమ్మతో కలిసి వెళ్లి ప్రార్థనలు చేశారు.
షర్మిల తెలంగాణలో 400 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. దాదాపు 4 వేల కిలో మీటర్లు ఆమె పాదయాత్ర చేయనున్నారు. మంగళవారం ఉదయం చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం పాదయాత్ర ప్రారంభమవుతుందని వైఎస్ఆర్టీపీ నేతలు తెలిపారు.
తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీసీ జన గణన చేపట్టాలని లేఖలో ఆయన కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందని, సంక్షేమ పథకాలు అమలు చేసినా ఆ వర్గాలు వెనకబడే ఉన్నాయని అన్నారు. బీసీ జన గణన జరిగినప్పుడే సంక్షేమ ఫలాలు అందుతాయని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు కులాల వారీ వివరాలు 90 ఏళ్ల నాటివని చంద్రబాబు గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకే యాదాద్రికి రావాల్సి ఉండగా.. గంట ఆలస్యంగా వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం వచ్చారు. పెద్ద గుట్ట టెంపుల్ సిటీ హెలిప్యాడ్‌పై సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి కాన్వాయ్‌లో వచ్చిన కేసీఆర్‌కు ఆలయ అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఘనమైన స్వాగతం పలికారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక యాదాద్రి పర్యటనకు రావడం ఇది 15వ సారి. ఆలయ పున:ప్రారంభ తేదీలను ఈ సందర్భంగా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
సూర్యాపేటకు చెందిన ఓ యువకుడు మలేసియాలో మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని సూర్యాపేట పట్టణానికి చెందిన మోటకట్ల వెంకటరమణా రెడ్డి, మాధవి కుమారుడు రిశివర్ధన్ రెడ్డి (21)గా గుర్తించారు. రిశివర్ధన్ ఓ ప్రైవేటు షిప్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ సోమవారం చనిపోయాడు. షిప్ పైనుంచి సముద్రంలో పడిపోవడంతో అతను చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు మలేసియా అధికారులు ఫోన్‌లో సమాచారం అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్ఘాటన, మహా సుదర్శన యాగ నిర్వహణ తేదీ వివరాలను సీఎం ప్రకటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సీఎం యాదాద్రికి చేరుకుంటారు. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన వేళ అన్నింటిని మరోసారి పరిశీలిస్తారు. యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామి నిర్ణయించగా.. ఆ తేదీలను కేసీఆర్ యాదాద్రిలో ప్రకటించే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాచకొండ కమిషనరేట్ పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 19న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -