కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని అందవెల్లి సమీపంలో పెద్ద వాగుపై ఉన్న వంతెన కుప్పకూలి పోయింది. రెండు నెలల కిందట భారీ వర్షాలు, వరదలతో బ్రిడ్జిలోని ఓ పిల్లరు కుంగి పోయిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆ తర్వాత మరింతగా కుంగిన వంతెన అర్ధరాత్రి కుప్పకూలింది. బ్రిడ్జికి సంబంధించిన రెండు పిల్లర్లు, మూడు స్లాబులు నేలమట్టం అయ్యాయి.


గతంలో బ్రిడ్జి కుంగగానే దానిపై నుండి అధికారులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో 42 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు దిక్కుతోచని స్థితిలో ప్రమాదకరంగా తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట విద్యార్థులతో వెళ్తున్న తెప్ప బోల్తా కూడా పడింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికి ఏం కాలేదు. ప్రతిరోజు వివిధ పనులపై కాగజ్‌నగర్‌ కు వచ్చే ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కాగజ్‌నగర్‌ నుండి దహెగాం మండల కేంద్రానికి వెళ్లాలంటే రెండు ఆటోలు మార్చాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోను ఎంగేజ్ చేసుకుంటే 600 రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. దీంతో వారికి ఆర్థికంగా ఎంతో భారం పడుతోంది.


ఇక వైద్య సేవలు లేని మారుమూల గ్రామ ప్రజలు మరో మార్గంలో వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి వస్తోంది. ఈ వంతెన పూర్తైతే తప్ప తమ కష్టాలు తీరవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు తీరవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వంతెన కుప్పకూలడంతో వంతెన ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అసలు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ బ్రిడ్జి వంగిపోయిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎండాకాలంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా సాగింది. ఇసుక దొంగలు వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమ రవాణా చేశారు. అధికారుల దృష్టికి ఈ విషయం వెళ్లినా పట్టించుకోలేదు. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కావాలనే చూసీ చూడనట్లు వ్యవహరించారని పలువురు దుయ్యబడుతున్నారు. అలా ఇష్టారీతిన ఇసుక తరలింపు నేపథ్యంలో పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.


రెండు నెలల క్రితం కుంగిన వంతెన


కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై ఉన్న బ్రిడ్జ్ రెండు నెలల క్రితమే వరదల కారణంగా కుంగిపోయింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు. స్థానిక ఎమ్మార్వో ప్రమోద్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్ బ్రిడ్జ్ వద్దకు చేరుకుని ఇరువైపులా గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అందవెల్లి వంతెన కుంగిపోవడానికి అసలు కారణం ఇసుక దొంగలని, వంతెన పిల్లర్ వద్దే తవ్వకాలు చేసి ఇసుకను అక్రమరవాణా చేసుకున్నారని, దీంతో పిల్లర్ భూమిలోకి కుంగిపోయిందని స్థానికులు ఆరోపించారు. 


42 గ్రామాలకు రాకపోకలు బంద్ 


బ్రిడ్జ్ దెబ్బతినడం పట్ల స్థానిక విపక్ష నాయకులు విమర్శించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం, ఇక్కడి నాయకుల నిర్లక్ష్యమేనన్నారు. గత సంవత్సరం నుంచి బ్రిడ్జ్ కుంగిపోతున్నా అధికారులు చూస్తూ కూర్చున్నారని, దీంతో దాదాపుగా 42 గ్రామాల ప్రజలు ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బ్రిడ్జ్ పిల్లర్ కు మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు. బ్రిడ్జ్ పై రహదారికి అడ్డంగా గోడలు కట్టి రాకపోకలు నిలిపివేశామని తహసీల్దార్ ప్రమోద్ కుమార్ తెలిపారు. వంతెన పిల్లర్ కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్నందున రహదారిని మూసివేశామని ప్రజలు సహకరించాలని కోరారు.