Amit Shah Telangana Tour cancelled: హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా ( Amith Shah) పర్యటన రద్దు అయింది. షెడ్యూల్  ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం (జనవరి 28న) రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ బిహార్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాల (Bihar Politics)తో తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో  అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, మహబూబ్ నగర్,హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.


RJD, కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 8వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆ కూటమికి గుడ్ బై చెప్పి బీజేపీతో కలిసి సర్కార్ ఏర్పాటు చేసే యోచనలో నితీష్ ఉన్నట్లు సంకేతాలు వచ్చేశాయి. అంతా సవ్యంగా జరిగితే జనవరి 28వన నితీష్ కుమార్ బిహార్ కు 9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. బిహార్ రాజకీయ పరిస్థితుల కారణంగా అమిత్ షా రేపటి తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 


ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా? 
కేంద్ర  మంత్రి అమిత్ షా ఈ నెల 28వ తేదీన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల కిందట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy ) తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కొంగరకలాన్‌ గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో అమిత్ షా సమావేశం ఉంటుందని ప్లాన్ చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. గత ఎన్నికల్లో రాజా సింగ్ ఒక్కరే నెగ్గగా, ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలవడం తెలిసిందే. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 8 మంది విజయం సాధించారు. అసెంబ్లీకి వెళతారని భావించిన బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు సహా కీలక నేతలు ఓటమి చెందారు. దీంతో లోక్‌సభ ఎన్నికలపై పార్టీ సీనియర్లకు షా కీలక సూచనలు చేసేలా బీజేపీ ప్లాన్ చేసింది. 


సీనియర్లు ఓడినా బీజేపీకి మంచి ఫలితాలే                


తెలంగాణలో సీనియర్ నేతలు ఓడిపోయినప్పటికీ..మంచి  ఓటు పర్సంటేజీ వచ్చింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. 8 స్థానాల్లో గెలవడమే కాకుండా మరో 18 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ బాగా బలపడుతోందని  హైకమాండ్ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలో పార్టీ నేతకు దిశానిర్దేశం చేయాలని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నేతలు వర్గ పోరాటానికి దిగడంతో పార్టీ ఎక్కువగా నష్టపోయింది. సీనియర్లు అందరూ ఓడిపోవడానికి వర్గ పోరాటమే కారణమని భావిస్తున్నారు.                            


10 లోక్‌సభ సీట్లపై బీజేపీ గురి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం..  బీజేపీ హైకమాండ్ ఢిల్లీలో ఓ వార్ రూం సిద్ధం చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే వార్ రూం పని చేసే ్అవకాశాలు ఉన్నాయి.  అక్కడి నుంచి వచ్చే సూచనలు, సలహాలు ఆధారంగా పని చేసే అవకాశాలు  ఉన్నాయి. కనీసం పది నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా ప్రయత్నించాలని ఇప్పటికే  దిశానిర్దేశం చేశారు. .