Amith Shah Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌పై బిపోర్ జాయ్ తుపాన్ ఎఫెక్ట్ పడింది. ఆయన పర్యటన రద్దయినట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. బిపర్‌జాయ్ తుఫాన్ ప్రధానంగా గుజరాత్ పైనే ప్రభావం చూపనుంది. దీంతో అమిత్ షా మరింత ఎక్కువగా ఆ రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఇప్పటికే గుజరాత్ హై అలర్ట్ లో ఉంది. బిపర్జోయ్ తుఫాన్ సన్నద్ధతపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. బిఫర్‌జాయ్ తుఫాన్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో గురువారం సాయంత్రం జఖౌ సమీపంలో తీరం దాటనుంది. ఖచ్చితంగా గురువారం మొత్తం అమిత్ షా హైదరాబాద్‌లో ఉండేలా షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్‌లో తుపాను పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సి ఉన్నందున పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
గుజరాత్ తుపాను ఎదుర్కోవడంపై కేంద్ర హోంశాఖ దృష్టి
బిపోర్ జాయ్ తుఫాను విపత్కర ప్రభావాన్ని అంచనా వేస్తూ పలు ప్రభుత్వ సంస్థలు తీరప్రాంత జిల్లాలైన సౌరాష్ట్ర, కచ్ లలో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్ లోని ఎనిమిది జిల్లాల్లో సముద్రం సమీపంలో నివసిస్తున్న దాదాపు 37,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యం సరిపోదని.. కేంద్ర బలగాలు అవసరం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్ కావడంతో ఆ రాష్ట్రంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే పూర్తిగా రద్దు అయింది. త్వరలో మరో తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
షెడ్యూల్ ప్రకారం నేటి రాత్రి నుంచి రేపటి రాత్రి వరకూ తెలంగాణలో ఉండాల్సిన అమిత్ షా
షెడ్యూల్ ప్రకారం.. అమిత్‌షా బుధవారం రాత్రి 11.55 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులతో పాటు పార్టీ నేతల సమావేశంలో పాల్గొనాల్సి లఉంది. గురువారం సాయంత్రం ఖమ్మంలో బహిరంగసభలో ప్రసంగించాల్సి ఉంది. ఖమ్మం బహిరంగసభపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా బీజేపీ వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా పర్యటన తర్వాత ఊపు వస్తుందని.. చేరికలు పెరుగుతాయని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ.. బిపోర్ జాయ్ తూపాన్ కారణంగా పర్యటన రద్దవడంతో బీజేపీ నేతలు నిరాశ పడుతున్నారు.
ఖమ్మం బహిరంగసభకు త్వరలో మరో తేదీ ఖరారు చేస్తామన్న బండి సంజయ్
అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత మరోసారి తెలంగాణ పర్యటనకు ఆమిత్ షా వస్తారని.. ఖమ్మంలోనే బహిరంగసభ ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ చెబుతున్నారు. తెలంగాణ బీజేపీకి ఇటీవలి కాలంలో ఏదీ కలసి రావడం లేదన్న నిరాశ బీజేపీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. ఈ నెలలోనే ప్రధాన మంత్రి మోదీ పర్యటన తెలంగాణలో ఉంది. ఆ సభను విజయవంతం చేసి సత్తా చూపిస్తామని నేతలంటున్నారు.