Amit Shah Khammam Tour: ఆగస్టు 27వ తేదీన ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నందున బీజేపీ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది.అయితే అమిత్ షా ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని బీజేపీ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ పార్టీ ప్రచారానికి ఊపునిస్తుంది. అమిత్ షా జూన్‌లో ఇక్కడ ర్యాలీ నిర్వహించా ప్రసంగించాల్సి ఉండగా.. తుఫాను బిపార్జోయ్ కారణంగా వాయిదా పడింది.
అయితే పరిస్థితులు చక్కబడిన తర్వాత మరోసారి తెలంగాణ పర్యటనకు ఆమిత్ షా వస్తారని.. ఖమ్మంలోనే బహిరంగసభ ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ బీజేపీకి ఇటీవలి కాలంలో ఏదీ కలసి రావడం లేదన్న నిరాశ బీజేపీ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. కానీ ఇదే సమయంలో అమిత్ షా పర్యటన ఫిక్స్ కావడంతో బీజేపీ శ్రేణులు తెగ సంబుర పడిపోతున్నారు. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా పార్టీ ఎన్నికల సన్నాహాలను అంచనా వేయడానికి పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశమవుతారు. క్షేత్రస్థాయి రిపోర్టులను పరిశీలించి, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రణాళికలు, కార్యక్రమాలపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీజేపీ నేతలు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, వారి ఆకాంక్షలను గ్రహించి, అవినీతి బారి నుండి తెలంగాణను విముక్తి చేయడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం చూస్తున్నారని చెప్పారు.తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా నిలుస్తుందని, వారి ఆకాంక్షలు, కలలు సాకారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. అధికార భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికలకు చాలా మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.