Amit Shah Hyderabad Visit: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 17న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆ రోజున జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆసక్తి పరిణామం చోటుచేసుకోనుంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో అమిత్ షా భేటీ కానున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మర్యాదపూర్వకంగానే సింధును అమిత్ షా కలవనున్నారని వెల్లడించాయి. కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందిగా సింధును అమిత్ షా కోరే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. క్రీడా రంగంలో పీవీ సింధుకు మంచి పాపులారిటీ ఉంది. దేశం తరపున వివిధ టోర్నీలలో ఎన్నో పతకాలు సాధించింది. తెలుగు రాష్ట్రంలో పీసీ సింధు అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. తమ పార్టీ కోసం సింధు మద్దతు కోరే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. సినీ, క్రీడా రంగాలకు సంబంధించిన ప్రముఖులతో అగ్ర నేతలు భేటీ అవుతున్నారు. గతంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా విజయం సాధించినందుకు ఎన్టీఆర్‌ను ప్రశంసించడానికి అమిత్ షా కలిసినట్లు కాషాయ వర్గాలు బయటకు చెప్పినా.. ఈ భేటీ వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ఊహాగానాలు వినిపించాయి.
సౌత్ ఇండియాలో బీజేపీ అంత స్ట్రాంగ్ కాకపోవడంతో బలం పుంజుకోవాలని ఎప్పటినుంచో వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్‌ను అమిత్ షా కలిశారని, సౌత్ ఇండియాలో ఎన్టీఆర్ క్రేజ్‌ను బీజేపీ ఉపయోగించుకోనుందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ భేటీలో అసలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు బయటకు రాలేదు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనలో యంగ్ హీరో నితిన్, టీమిండియా ఉమెన్స్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో భేటీ అయ్యారు. ఇలా వరుసగా సెలబ్రెటీలతో భేటీ అవుతూ వస్తుండగా.. ఇప్పుడు పీవీ సింధుతో అమిత్ షా నేరుగా సమావేశం కానుండటం కీలకంగా మారింది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 17న వేడుకలు జరగనుండగా.. 16న రాత్రి 7.30 గంటకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రానున్నారు. 17న పరేడ్ గ్రౌండ్‌లో జరగనున్న వేడుకల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైన క్రమంలో.. సీఎం కేసీఆర్‌పై అమిత్ షా విమర్శలు చేసే అవకాశముంది. దీంతో అమిత్ షా ఏం మాట్లాడతారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.