Telangana MLC : కేబినెట్ సిఫారసు చేసినా ఇంకా ఆమోదముద్ర వేయని గవర్నర్ - ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు కాలేరా ?

తెలంగాణ కేబినెట్ ఆమోదించినా ఆ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లకు గవర్నర్ ఆమోదముద్ర వేయలేదు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ ప్రారంభమయింది.

Continues below advertisement

Telangana MLC :  తెలంగాణ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేసిన కేబినెట్ గవర్నర్‌కు ఫైల్ పంపి చాలా కాలం అయింది.  గవర్నర్ వారి నియామకానికి ఇంకా ఆమోదం తెలియచేయసేసదు.  తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించిన కేబినెట్‌.. బీసీ కోటా నుంచి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌ దాసోజు శ్రవణ్‌ను... ఎస్టీ సామాజిక వర్గం నుండి కుర్రా సత్యనారాయణను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైలును గవర్నర్ వద్దకు పంపారు. ఐతే.. గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలుపుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన ఇద్దరు నేతలతో పాటుగా అధికార పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Continues below advertisement

గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయగా తమిళిసై ఆమోదం తెలుపలేదు. కౌశిక్ రెడ్డిపై కేసులు ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో గవర్నర్ పెండింగ్‌లో ఉంచారు. దీంతో రాజ్‌భవన్‌కు.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తలెత్తింది. చివరికి కేసీఆర్‌ సర్కార్‌... కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి గవర్నర్ కోటాలో మధుసూదనాచారికి అవకాశం కల్పించారు.  అప్పటి నుండి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదం ఇంకా కొనసాగుతోంది.

గతంలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్‌ను గవర్నర్ ఆమోదించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ పంపిన బిల్లు డ్రాఫ్ట్‌ను ఆమోదించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య హైడ్రామా చేటు చేసుకుంది. మొత్తానికి సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ విమర్శలు చేయడం.. అదే విధంగా గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేయడం కామన్‌గా మారింది. ఈ తరుణంలో అసెంబ్లీ ఎన్నికల ముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నామినేట్ చేసే విషయంలో తమిళి సై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ నెలకొంది.     

సాధారణంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయాలంటే.. వివిధ రంగాల్లో పేరు ప్రతిష్టలు పొందిన వారిని , మేధావులను సిఫారసు చేయాలనే సంప్రదాయం ఉంది. పాడి కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయన్న కారణంగా గవర్నర్ తిరస్కరించారు. దాసోజు శ్రవణ్ రాజకీయ నేతగానే  అందరికీ పరిచయం. అలాగే కుర్రా సత్యనారాయణ కూడా మాజీ ఎమ్మెల్యే. ఈ కారణాలతో వారి పేర్లను గవర్నర్ ఆమోదించడం లేదని చెబుతున్నారు. నిజానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పదవి కాలం ఎప్పుడో పూర్తయింది. కొంత కాలం ఎవర్నీ నియమించకుండా కేసీఆర్ ఆలస్యం  చేస్తే..ఇప్పుడు గవర్నర్ పెండింగ్ లో పెట్టారు.  

Continues below advertisement
Sponsored Links by Taboola