BJP News :  ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు  ఎంపీ ధర్మపురి అరవింద్ లకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఇద్దరు నేతలుcrpf భద్రత పరిధిలోకి వెళ్లనున్నారు. ఈట‌లకు వై ప్లస్, అర్వింద్ కు వై సెక్యూరిటీ, ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించనున్నారు.  ఇద్దరి నాయకుల ఇళ్లకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెళ్లి.. పరిశీలించనున్నారు.  ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్ కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి.


ఇంతకు ముందే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ సెక్యూరిటీ          


ఈటల రాజేందర్ హత్యకు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఇంచార్జ్ కౌశిక్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని ఇటీవల ఈటల జమున ఆరోపించారు.  రూ. ఇరవై కోట్లు ఖర్చు పెడతానన్నారని ఆమె చేసిన ఆరోపణలు రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తయింది. పోలీసు అధికారులతో భద్రతా సమీక్ష చేశారు. అయితే కేంద్రానికి కూడా ఈ విషయం మొరపెట్టుకోవడంతో వై ప్లస్ భధర్త కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ధర్మపురి అరవింద్ కూడా తనపై కుట్రలు జరుగుతున్నాయని కేంద్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు.  ఇటీవల ధర్మపురి అర్వింద్  ఇంటిపై ఎమ్మెల్సీ కవిత అనుచరులు దాడి చేశారు. ఆయన నియోజవవర్గంలో ఎక్కడ పర్యటించినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు.                           


బీజేపీ కీలక నేతలకు కేంద్ర భద్రత కల్పించడంతో కలకలం                                    


బీజేపీ ముఖ్య నేతలిద్దరూ కేంద్ర భద్రత  పెంచడం రాజకీయంగానూ చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో  హత్యా రాజకీయాలకు ప్రణాళికలు వేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సమయంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. నాయకుల ఆరోపణలు, విజ్ఞప్తులతోనే కేంద్రం భద్రత కల్పించదని.. వారికి ఇంటలిజెన్స్ సమాచారం వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల మంటలు పెరుగుతున్నాయి. నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఇంటలిజెన్స్ కు ఏమైనా సమాచారం వచ్చి ఉంటుందని  భావిస్తున్నారు.   


వారి సెక్యూరిటీని ప్రత్యేకంగా చూస్తున్న తెలంగాణ పోలీసులు                                                          


వీరిద్దరికీ సెక్యూరిటీ కల్పించడంతో..  భద్రత విషయంలో రాష్ట్ర పోలీసులు రాజీ పడ్డారనే అభిప్రాయం వినిపించకుండా ప్రభు్తవం  కూడా చర్యలు తీసుకుంటోంది. ముప్పు ఉందని చెబుతున్న వారి సెక్యూరిటీనిప పెంచుతోంది.  వారికి ఎవరి నుంచి ముప్పు ఉంటుందో వారిపై నిఘా పెడుతున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడిపై దాడి జరిగినా అధికారంలో ఉన్నపార్టీకే చెడ్డ పేరు వస్తుందని..  అంటున్నారు.