Allu Arjun Comments After Released From Chanchalguda Jail: తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 'నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, కట్టుబడి ఉంటాను. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలియజేస్తున్నా. నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఈ ఘటన జరిగింది. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నా. నా సినిమాలే కాదు.. మావయ్య సినిమాలు చూశాను. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు.' అని పేర్కొన్నారు.

Continues below advertisement


బన్నీని చూసి భావోద్వేగం


శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్.. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ న్యాయవాదులతో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిపారు. బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం కావడంపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. బన్నీని చూసి కుటుంబసభ్యులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. భార్య, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ, భార్య, అత్త ఆయన కోసం ఎదురు చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాసానికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. తన కుమారుడు, కుమార్తెను ఎత్తుకుని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. సతీమణి స్నేహను ఆప్యాయంగా కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.


కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైలు వెనుక గేట్ నుంచి బన్నీని పోలీసులు బయటకు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయన తన నివాసానికి చేరుకున్నారు.  కాగా, శనివారం ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని ప్రచారం సాగడంతో.. ఫ్యాన్స్‌తో పాటుగా మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. దీంతో గందరగోళం ఏర్పడగా.. ఆయన్ను 06:05 గంటలకు వెనుక గేట్ నుంచి పంపించారు. 


Also Read: Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?