Telangana DSC: తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టుల‌ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సంగ‌తి తెలిసిందే. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ ఆగస్టు 25న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ప్రధానంగా ఎస్‌జీటీ-2,575 పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్‌-1739 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.


ఉపాధ్యాయ నియామకాల్లో తెలంగాణ ప్రభుత్వం ఈసారి కీలక మార్పులు చేపట్టనుంది. స్థానికేతర కోటా కింద ఏదైనా ఒక జిల్లాను మాత్రమే అభ్యర్థులు ముందే ఎంపిక చేసుకోనులా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. గత టీఆర్‌టీలో 10 ఉమ్మడి జిల్లాల్లోని కొలువులకు స్థానికేతర కోటా కింద మిగతా జిల్లాలవారు పోటీపడేందుకు అవకాశం కల్పించారు. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఏదైనా ఒక జిల్లాను మాత్రమే స్థానికేతర కోటా కింద ఎంచుకోవాల్సి ఉంటుంది. 


దీంతో స్థానికేతర కోటా కింద కొలువులు దక్కించుకోవడం అంత సులభమేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ 2012 వరకు నిర్వహించిన డీఎస్‌సీల్లో ఏదైనా ఒక జిల్లాకు మాత్రమే స్థానికేతర అర్హత ఉండేదని విద్యాశాఖ అధికారులు గుర్తుచేస్తున్నారు. 2017 జులైలో టీఎస్‌పీఎస్‌సీ నియామకాలు చేపట్టడంతో ఆ విధానం పాటించిందని, ఈసారి పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండడంతో మార్పులు ఉంటాయన్నారు. 


అప్పుడు అలా ఇప్పుడు ఇలా..
2017 జులైలో నిర్వహించిన టీఆర్‌టీలో నాన్‌లోకల్‌ కోటా కింద అభ్యర్థులకు సొంత జిల్లా మినహా మిగతా జిల్లాల్లోని 20 శాతం పోస్టులకు పోటీపడే అవకాశం కల్పించారు. అప్పుడు మొత్తం 5,415 ఎస్‌జీటీ కొలువులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అందులో 20 శాతం పోస్టులకు నాన్‌ లోకల్‌ కోటా వర్తింపజేశారు. సొంత జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నవారు ఎక్కువ ఖాళీలున్న జిల్లాల నుంచి పోటీ పడే అవకాశం వచ్చింది. టీఆర్‌టీలో వచ్చిన రాష్ట్ర ర్యాంకు ఆధారంగా జిల్లాల వారీగా ప్రాధాన్యం ఇచ్చుకున్నారు. 


అయితే ఈ సారి స్థానిక జిల్లాతో పాటు ఏదో ఒక్క జిల్లాకు మాత్రమే స్థానికేతర కోటా కింద ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టీఆర్‌టీ దరఖాస్తు సమయంలోనే ఏ సబ్జెక్టు, పోస్టుకు పోటీపడుతున్నారనే వివరాలు తీసుకుంటారు. ఆ లెక్కలో ఎంపిక చేసుకున్న జిల్లాలోని ఖాళీలకే అభ్యర్థులు పోటీపడాల్సి ఉంటుంది. అయితే ఈ సారి కోటాలనూ మార్పులు చేశారు. స్థానిక కోటా 95 శాతం కాగా.. స్థానికేతర, నాన్ లోకల్ 5 శాతం మాత్రమే ఉంటుంది. 


జిల్లాను యూనిట్‌గా తీసుకోనుండడంతో స్థానికేతర కోటా కింద చాలా తక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఎస్జీటీ పోస్టుల్లో స్థానికేతర కోటా కింద కొన్ని పోస్టులైనా ఉండే అవకాశం ఉంది. స్కూల్‌ అసిస్టెంట్‌లకు సబ్జెక్టుల వారీగా స్థానిక, స్థానికేతర కోటా ఉంటుంది. దీంతో అధిక శాతం జిల్లాలు, సబ్జెక్టులకు స్థానికేతర కోటా కింద ఖాళీలు ఉండే అవకాశం లేదని స్పష్టమవుతోంది.


జిల్లాలవారీగా ఖాళీలు ఇలా..
ప్రభుత్వం ప్రకటించిన 5,089 ఉపాధ్యాయ ఖాళీల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 358 పోస్టులు ఖాళీగా ఉండగా.. అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 43 ఖాళీలు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్-275, ఆసిఫాబాద్-289, భద్రాద్రి 185, హనుమకొండ-54, జగిత్యాల-148, జనగామ-76, జయశంకర్ భూపాలపల్లి-74, జోగులాంబ-146, కామారెడ్డి-200, కరీంనగర్-99, ఖమ్మం-195, మహబూబాబాద్-125, మహబూబ్‌నగర్-96, మంచిర్యాల-113, మెదక్-147, మేడ్చల్-78, ములుగు-65, నాగర్‌కర్నూలు-114, నల్గొండ-219, నారాయణపేట-154, నిర్మల్-115, నిజామాబాద్-309, పెద్దపల్లి-43, రాజన్నసిరిసిల్ల-103, రంగారెడ్డి-196, సంగారెడ్డి-283, సిద్ధిపేట-141, సూర్యాపేట-185, వికారాబాద్-191, వనపర్తి-76, వరంగల్-138, యాదాద్రి-99 పోస్టులు ఉన్నాయి.