Adilabad Bus Accident Viral video: ఆదిలాబాద్ జిల్లా నేరడిగోండ మండలం బందం వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి దిగే ఉద్దేశంతో వాంకిడి మీదుగా నిర్మల్ వైపు మలుపు తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును వెనుక భాగంలో లారీ ఢీకొట్టింది. అయితే, బస్సు పూర్తిగా రోడ్డు దాటిన తరువాత లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం తప్పింది. లారీ లేదా బస్సులో ఏదైనా ఒక్క క్షణం ముందు వచ్చినా ఘోర ప్రమాదం చూడాల్సి వచ్చేది. లారీ డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించి క్షణాల్లో లారీ స్పీడును అదుపు చేసి స్టీరింగ్ నూ కుడి వైపునకు తిప్పడంతో బస్సు చివరి భాగంలో కొంతమేర డ్యామేజ్ జరిగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది.


ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మహరాష్ట్రలోని కిన్వట్ నుండి నిర్మల్ వైపు ఆర్టీసీ బస్సు వెళుతుంది. ఈ వీడియో అక్కడి జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా చూస్తే.. లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే ఈ ప్రమాదం ఏలా జరిగి ఉండేదో చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా అనిపిస్తోంది. సీసీటీవీ కెమెరాలో చూస్తే ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.