Adilabad Muncipal Manager Died Due to Heart Attack: ఆ ప్రభుత్వ ఉద్యోగి ఉత్తమ అధికారిగా అందరి మన్ననలు అందుకున్నారు. ప్రజలకు అందించిన ఉత్తమ సేవలకు గానూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పురస్కారం సైతం ప్రకటించింది. రిపబ్లిక్ డే రోజున కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఆయన ఆ ఆనందంలో ఉండగానే మృత్యువు కబళించింది. గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. పురస్కారం అందుకున్న గంటలోనే ఆ అధికారి హఠాన్మరణానికి గురి కావడం తోటి సిబ్బందిని కలచివేసింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.
మంచిర్యాల (Mancherial) జిల్లా సీసీసీ నస్పూరు పట్టణానికి చెందిన దివాకర్ (56) (Diwakar) ఆదిలాబాద్ (Adilabad) బల్దియాలో మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ ఉద్యోగిగా ఎంపికైన ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజ్ (Rahul Raj) చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్ లో గల తన ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పుట్టినప్పటి నుంచి వైకల్యం కారణంగా వీల్ ఛైర్ కే పరిమితమైన ఆయనకు 2004లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పదేళ్లకు పైగా ఆదిలాబాద్ బల్దియాలోనే విధులు నిర్వహిస్తూ.. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్ స్థాయికి చేరుకున్నారు. ఆయన కుటుంబం ఆదిలాబాద్ లోనే స్థిరపడగా.. భార్య నాగలక్ష్మి, కుమారుడు సాయి (సాఫ్ట్ వేర్ ఉద్యోగి), గిరిధర్ (ఆర్మీ ఉద్యోగి) ఉన్నారు. పురస్కారం స్వీకరించిన రోజే దివాకర్ మరణించడం అందరిలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. పురపాలక అధ్యక్షుడు జోగు ప్రేమేందర్, కమిషనర్ ఎ.శైలజ, బల్దియా అధికారులు, ఇతర సిబ్బంది ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
మరో విషాదం
అటు, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భయంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన విజయ్ (24)తో మహారాష్ట్రకు చెందిన పల్లవి (22)కి గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారింటికి వచ్చింది. కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. దీన్ని గమనించిన కుటుంబీకులు ఆమెను వెంటనే రిమ్స్ కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో తన భార్య మృతి పట్ల తనపై అపవాదు వస్తుందేమో అన్న భయంతో ఆమె భర్త విజయ్ శ్మశాన వాటికకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: OU News: ఓయూ లేడీస్ హాస్టల్‌లోకి ఆగంతకులు- విద్యార్థుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తత