Hyderabad Player Tanmay Agarwalదేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌(Team Hyderabad) జట్టు మరోసారి అదరగొట్టింది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. నాలుగో మ్యాచ్‌లోనూ సత్తా చాటింది.  అరుణాచల్‌ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్‌ డివిజన్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ చరిత్ర సృష్టించాడు.


ఇదేం బాదుడు


తన్మయ్‌ అగర్వాల్‌ కేవలం 147 బంతుల్లో త్రి శతకం సాధించి దేశవాళీ క్రికెట్‌లో రికార్డు సృష్టించాడు. 147 బంతుల్లోనే 300 పరుగులు సాధించిన తన్మయ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్‌ సెంచరీని నమోదు చేశాడు. 2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్‌ 191 బంతుల్లో 300 పరుగులు చేయగా... ఈ రికార్డును తన్మయ్‌ బద్దలు కొట్టాడు.


దిగ్గజాలను దాటిన తన్మయ్‌ అగర్వాల్‌ 


న్యూజిలాండ్‌కు చెందిన కెన్ రూథర్‌ఫర్డ్‌ 234 బంతుల్లో... వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ 244 బంతుల్లో.. శ్రీలంకకు చెందిన కుశాల్‌ పెరిరా 244 బంతుల్లో త్రిశతకాలు సాధించారు. వీరందినీ అధిగమించిన తన్మయ్‌ కేవలం 147 బంతుల్లో ట్రిపుల్‌ సెంచరీ సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్లతో 323 పరుగులు చేసిన తన్మయ్‌ నాటౌట్‌గా ఇంకా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.


రవిశాస్త్రి రికార్డు బద్దలు
తన్మయ్‌ భారత దేశవాళీ క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ  చేసిన ఆటగాడిగూనూ రికార్డు నెలకొల్పాడు. తన్మయ్‌ కేవలం 119 బంతుల్లో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 39 ఏళ్ల క్రితం దేశవాళీ క్రికెట్‌లో రవిశాస్త్రి 123 బంతుల్లో డబల్‌ సెంచరీ చేయగా.. ఈ రికార్డును తన్మయ్‌ బద్దలు కొట్టాడు. తన్మయ్‌ కేవలం 119 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. రంజీ ట్రోఫీలో ఒక ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌ (14) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును కూడా తన్మయ్‌ (21) బద్దలు కొట్టాడు.


ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.,..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్ 39.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సీవీ మిలింద్‌ (3/36), కార్తికేయ (3/28) మూడేసి వికెట్లతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 48 ఓవర్లలో ఒక వికెట్‌కు 529 పరుగుల భారీ స్కోరు సాధించింది. తన్మయ్‌, కెప్టెన్‌ రాహుల్‌ సింగ్‌ (185; 105 బంతుల్లో 26×4, 3×6) మొదటి వికెట్‌కు 449 పరుగులు జోడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ 357 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరోవైపు గాదె హనుమ విహారి (119 బ్యాటింగ్‌; 243 బంతుల్లో 15×4, 3×6), కెప్టెన్‌ రికీ భుయ్‌ (120; 201 బంతుల్లో 14×4) సెంచరీలతో కదంతొక్కడంతో చత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలీట్‌ గ్రూపు-బి మ్యాచ్‌లో ఆంధ్ర భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి రోజు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్లకు 277 పరుగులు సాధించింది.


హైదరాబాద్‌ జోరు
దేశవాళి ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ(Ranji Trophy) లో హైదరాబాద్‌(Team Hyderabad) జట్టు అదరగొడుతోంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న హైదరాబాద్‌ జట్టు.. నాలుగో విజయం దిశగా పయనిస్తోంది. తొలి మూడు మ్యాచుల్లో ఇన్నింగ్స్ విజయాలు సాధించిన హైదరాబాద్‌ జట్టు నాలుగు మ్యాచ్‌లోనూ ఇన్నింగ్స్ విజయం సాధించే దిశగా పయనిస్తోంది.