AP IAS came to Telangana News | హైదరాబాద్: డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి కొందరు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. ఆ రిలీవ్ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇంఛార్జ్ లను బుధవారం నాడు నియమించింది. డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఐఏఎస్‌లు వాణి ప్రసాద్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్ అక్టోబర్ 16న నిర్ణీత గడువు ప్రకారం రిలీవ్ అయ్యారు.
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్‌గా క్రిస్టినాకు, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టి.కె శ్రీదేవి, టూరిజంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవోగా ఆర్.వి కర్ణన్ లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు కేటాయించిన ప్రభుత్వం
- ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్ఎంసీ బాధ్యతలు
- ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, సీఎండీ, జెన్‌కో & ట్రాన్స్‌కో అదనపు భాద్యతలు
- ప్రభుత్వ కార్యదర్శి శ్రీధర్‌కు SCD, YAT&C శాఖ, డైరెక్టర్ ఆర్కియాలజీగా అదనపు భాద్యతలు
- డాక్టర్ టీకే శ్రీదేవి, SCD ప్రభుత్వ కార్యదర్శికి WCD & SC డిపార్ట్‌మెంట్ అదనపు భాద్యతలు
- ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తుకు హెచ్ఎం&ఎఫ్‌డబ్ల్యూ డిపార్ట్‌మెంట్, ఆయుష్ డైరెక్టర్‌గా అదనపు భాద్యతలు
- హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ డైరెక్టర్ ఆర్.వి.కర్ణన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అదనపు భాద్యతలు
ఐఏఎస్‌లకు హైకోర్టులో దక్కని ఊరట
ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ, తెలంగాణ క్యాడర్ సివిల్ సర్వీస్ అధికారులకు హైకోర్టులో ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులే వీరికి సైతం వర్తిస్తాయని కేంద్రం తరపు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. కానీ తమ సొంత ప్రాంతాలను తప్పుగా నిర్దారించినందున రాష్ట్రాల క్యాడర్ ను మార్చాలని ఐఏఎస్ లు కోరుతున్నారని, ముందస్తుగా ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని వారి తరఫు న్యాయవాది కోరారు. ఐఏఎస్ అయితే మాత్రం స్టే ఎలా ఇస్తామని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది.
తెలంగాణ సీఎస్‌కు రిపోర్ట్ చేసిన ఏపీ ఐఏఎస్‌లు
డీఓపీటీ ఆదేశాల మేరకు కొందరు ఐఏఎస్‌లు ఏపీ నుంచి రిలీవ్ అయ్యారు. ఐఏఎస్‌లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి బుధవారం నాడు రిపోర్ట్ చేశారు. కొందరు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. మరోవైపు ఐపీఎస్‌లకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దాంతో అంజనికుమార్, అభిలాష బిస్త్ ప్రస్తుతానికి తెలంగాణలోనే కొనసాగనున్నారు.