Adani Group Huge Donation To Skill University: యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యే లక్ష్యంతో వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. ఈ మేరకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సమావేశంలో అదానీ గ్రూప్ ఫౌండేషన్ ప్రతినిధులు, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు ఉన్నారు. కాగా, ఇటీవలే స్కిల్ వర్శిటీ వీసీ సహా బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇతర నియామకాలు చేపట్టారు. వర్శిటీ వీసీగా కేంద్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ ఎకనమిక్ అడ్వయిజర్‌గా పదవీ విరమణ చేసిన వీఎల్‌వీఎస్ఎస్ సుబ్బారావు పేరు ఖరారు చేశారు. యూనివర్శిటీ బోర్డు ఛైర్మన్‌గా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రాను నియమించారు.






రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలోని బేగరికంచెలో తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఇటీవల సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకూ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో వర్శిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. 17 రకాల కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటా లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంలో ఈ వర్శిటీని విస్తరించనున్నారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నవంబర్ 4వ తేదీ నుంచి స్కిల్ యూనివర్శిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతానికి ప్రాధాన్యం ఉన్న 6 కోర్సులతో మొదలు పెట్టి తర్వాత కోర్సులు పెంచనున్నారు. లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాసుటికల్స్, లైఫ్ సైన్సెస్ విభాగాల్లో యువతకు నైపుణ్యాలు పెంపొందించే విధంగా శిక్షణ ఇవ్వనున్నారు. 


మూడేళ్లలో 18 విభాగాలు


స్కిల్ యూనివర్శిటీలో మూడు దశల్లో 18 రంగాలకు చెందిన విభాగాల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. తొలిదశలో ఈ కామర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, యూనిమేషన్ - విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, కన్‌స్ట్రక్షన్ రంగాలకు చెందిన స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రెండో దశలో ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత డిజిటల్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ - సెమీ కండక్టర్స్ ఉన్నాయి. మొదటి దశలో 2 వేల మందికి, రెండో దశలో 10 వేల మందికి, మూడో దశలో 20 వేల మందికి పెంచాలన్నది లక్ష్యం. వర్శిటీలో కోర్సును బట్టి 3 నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది.


Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు