Navadeep Drugs Case :  సినీ నటుడు నవదీప్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు.   2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో వారి ముందు ఆయన నేడు హాజరయ్యారు. గుడిమల్కాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో  నమోదైన డ్రగ్స్ కేసులో బహిర్గతమైన అంశాల ఆధారంగా ఈనెల 10న  విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. పోలీసులకు చిక్కిన నైజీరియన్‌ డ్రగ్‌పెడ్లర్‌తో పాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌లను విచారించడంతో నవదీప్‌ పేరు బయటికివచ్చింది. ఈ క్రమంలోనే నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్‌ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. తాజాగా ఈడీ సైతం ప్రశ్నిస్తోంది.                                    


ఇటీవల నమోదైన కేసులో   29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు.  ఇప్పటికే ముగ్గురు నైజీరియన్‌లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారిలో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితో జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాల గురించి ప్రశ్నిస్తున్నారు.  మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను కోరిన ఈడి.. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో ఈడి దర్యాప్తు కొనసాగుతుంది.                                


మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను ఏ 29 గా పోలీసులు పేర్కొన్నారు. ఆయనను డ్రగ్స్ వినియోగదారుడు గా పేర్కొన్న పోలీసులు నవదీప్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించారు. నవదీప్ కేసు నుంచి తప్పించుకోవడానికి మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నుఅరెస్ట్ అయిన రామ చందర్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ కానీ తాను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొన్నారు.                    


డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రామచందర్ తో తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని కానీ.. డ్రగ్స్ కేసులో కాదని నవదీప్ చెబుతున్నారు. నార్కోటిక్ పోలీసుల విచారణకు హాజరయినప్పుడు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తన సమాధానం చెప్పానని, అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామని వారు చెప్పారని నవదీప్ విచారణ అనంతరం పేర్కొన్నారు. ఇక ఈ కేసులో నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారం చేసుకుని, ఈడీ అధికారులు నవదీప్ పై కేసు నమోదు చేశారు.