అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణలో భాగంగా తాడేపల్లి సమీపంలోని పాతూరు రోడ్డులోని సిట్ కార్యాలయానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకూ సీఐడీ ఆయన్ను విచారించనుంది. విచారణాధికారి జయరామ్ రాజ్ బృందం ఆధ్వర్యంలో లోకేశ్ ను విచారించనున్నారు.  ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుపై లోకేశ్ ను విచారించేందుకు సీఐడీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. 


కీలక పరిణామం


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ కేసు విచారణాధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ జయరామరాజును సీఐడీ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఇకపై డీఎస్పీ విజయభాస్కర్ విచారణాధికారిగా ఉంటారని విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.



ఏ-14గా నారా లోకేశ్



అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయంటూ నారా లోకేశ్ ను ఏ-14గా పేర్కొంటూ సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన ఈ నెల 4న హైకోర్టును ఆశ్రయించారు. అయితే, సీఐడీ విచారణకు అనుమతిచ్చిన ధర్మాసనం అధికారులకి పలు ఆదేశాలిచ్చింది. కాగా, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ లోకేశ్ ను విచారించనున్నారు. మధ్యలో ఓ గంట భోజన విరామం ఇవ్వనున్నారు.


సీఐడీకి హైకోర్టు ఆదేశాలు


విచారణ సమయంలో లోకేశ్ తో పాటు న్యాయవాదిని అనుమతించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్ ను ఒత్తిడి చెయ్యొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. హెరిటేజ్ కు సంబంధించిన ప్రశ్నలేవీ అడగొద్దని ధర్మాసనం సూచించింది. 


సీఐడీ ఏం చెబుతుందంటే.?


హెరిటేజ్ సంస్థకు లబ్ధి చేకూరేలా ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది. దీనిలో అక్రమాలు జరిగాయంటూ నారా లోకేశ్ కు నోటీసులు జారీ చేసింది. 


ఖండించిన టీడీపీ


సీఐడీ నోటీసులపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు లేని, వేయని, కనీసం భూ సేకరణ కూడా చేయని ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి ఎలా సాధ్యమంటూ ప్రశ్నిస్తోంది. రాజధానికి 30 కిలో మీటర్ల దూరంలో రాష్ట్ర విభజనకు ముందు హెరిటేజ్ సంస్థకు కేవలం 9 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే అవినీతి ఎలా అవుతుందని నిలదీస్తోంది.


చంద్రబాబు పిటిషన్ పై నేడు విచారణ


మరోవైపు స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, చంద్రబాబు వేసిన 3 బెయిల్ పిటిషన్లను సోమవారం హైకోర్టు తిరస్కరించింది. 


సీఐడీ వారెంట్లపైనా నేడు విచారణ


చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపైనా మంగళవారం విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత విజయవాడ ఏసీబీ కోర్డు విచారించనుంది. కాగా, అమరావతి రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లపై ఈ విచారణ జరగనుంది. చంద్రబాబుకు 2 కేసుల్లో రిమాండ్ విధించాలని సీఐడీ అదికారులు కోరారు.