ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమి కూలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ఫలితాలు చూశాక అందులోని పార్టీలో ఆ కూటమిలో ఉండాలా వద్దా? అని పునరాలోచనలో పడతాయని అభిప్రాయపడ్డారు. చెన్నైలో నేడు (అక్టోబరు 12) ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘సదర్న్ రైసింగ్ సమ్మిట్ - 2023’ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఇందులో కవితతో పాటు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వేదికపై ఉన్నారు. ‘2024 సాధారణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు?’ అనే అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కవిత తన అభిప్రాయాలు చెప్పారు. 


తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిన పనులు బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదని అన్నారు. కేంద్రంతో పోల్చితే తాము బెటర్ గానే పర్ఫామ్ చేశామని కవిత అన్నారు. పాన్ ఇండియాలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలనే ఉద్దేశంతోనే తాము థర్డ్ ఫ్రంట్ ఉండాలని భావించామని చెప్పారు. గతంలో కాంగ్రెస్, బీజేపీలు దేశంలో తెలంగాణ తరహా వృద్ధి చూపించలేదని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకే దేశ ప్రజలు కూడా ఆ రెండు పార్టీల పట్ల అసహనంతోనే ఉన్నారని అన్నారు. అందుకే తాము బీజేపీతో గానీ, కాంగ్రెస్‌ లేదా I.N.D.I.A తో గానీ ఉండాలని అనుకోవడం లేదని అన్నారు. 


వారంతా గేమ్ ఛేంజర్సే..
ఎన్నికల ఫలితాల తర్వాత ఒకవేళ గేమ్ ఛేంజర్ తరహాలో బీఆర్ఎస్ పార్టీ నిలిస్తే ఏ కూటమిలో అయినా చేరే అవకాశం ఉందా అని చేతన్ భగత్ ప్రశ్నించారు. దీనిపై కవిత స్పందిస్తూ.. గేమ్ ఛేంజర్స్ కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాదని.. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ లాంటివారు అందరూ గేమ్ ఛేంజర్సే అని అన్నారు. వీరంతా ఇండిపెండెంట్ గా అత్యధిక సీట్లు సాధించారని అన్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత I.N.D.I.A జోరు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటిదాకా వీరు జరిపిన చర్చలు జరిపినప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ కూటమిలోని పార్టీల ఆలోచనా విధానం మారే అవకాశం ఉంది. 


మన దేశం పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఎన్నికల తర్వాత ఏర్పడ్డ కూటములను చూసింది. అవి నిలకడగా ప్రభుత్వాన్ని నడిపాయి. ఎన్నికలకు ముందు ఏర్పడ్డ కూటములు అంత విజయవంతంగా, నిలకడగా ప్రభుత్వాలను నడిపిన దాఖలాలు లేవు. అందుకే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు పునరాలోచనలో పడతాయి. I.N.D.I.A లోనే ఉండాలా? లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనేవి ఆలోచిస్తాయి.’’ అని కవిత అన్నారు.


ఆ రెండు పార్టీలు కొట్టుకుంటూ I.N.D.I.A లో ఎలా చేరాయి?
బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కొట్లాడుకుంటాయని, కానీ ఆ రెండు పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయని కవిత అన్నారు. కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పోరు, పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలపడతాయని, మరి ఇలాంటప్పులు సీట్లను ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు. ఇది నిజమైన పొత్తులు అని ప్రజలకు ఎలా విశ్వాసం కల్పిస్తారని అడిగారు.


అసలు I.N.D.I.A లక్ష్యం ఏంటి?
బీజేపీని గద్దెదించాలన్నది I.N.D.I.A కూటమి ఎకైక ఎజెండా అని, కానీ ప్రజల కోసం ఇండియా ఎజెండా ఏమిటి అని ప్రశ్నించారు. బీజేపీని గద్దెదించడమే ఇండియా కూటమి లక్ష్యం అయితే మరి ప్రస్తుత ప్రభుత్వం కంటే ప్రజలు ఏం మెరుగైన పనులు చేస్తారని ప్రశ్నించారు.