ఊర్లలో ఆర్టీసీ బస్సు రాకుంటే.. అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ఏదో ఒక రోజు రాకుంటే అడ్జస్ట్ అయిపోతాం. పాఠశాల, కాలేజీ, కార్యాలయాలకు ఎలాగోలా వెళ్తాం. కానీ రోజూ రాకుంటే ఇబ్బందే. ఈ విషయంలో స్థానికి ఆర్టీసీలో ఆరా తీస్తాం. కానీ ఓ విద్యార్థిని మాత్రం.. ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఫిర్యాదు చేసింది.  


రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం చిడేడు గ్రామానికి చెందిన వైష్ణవి ఎనిమిదో తరగతి చదువుతుంది. తాను స్కూల్ కు వెళ్లాలంటే ఇబ్బంది అవుతుందని.. పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఈ విషయంపై భారత ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. ఆ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. వెంటనే చర్యలు తీసుకున్నారు.  తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణకు సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.



ఆర్టీసీ ఎండీగా నియమితులైనప్పటి నుంచి.. సంస్థను లాభాల బాట పట్టించేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు సజ్జనార్. తనదైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు.. సంస్థను లాభాల్లో నడిపించేదుకు చర్యలు తీసుకుంటున్నారు. సజ్జనార్ నిర్ణయాలతో సంస్థ ఉద్యోగుల్లోనూ ఉత్తేజం వస్తుంది. 


బస్టాండ్ లలో వివిద సేవలకు డబ్బులను యూపీఐ, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల సేవలను ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మహాత్మాగాంధీ బస్​స్టేషన్లోని టికెట్ రిజర్వేషన్ కౌంటర్, పార్శిల్-కార్గో కేంద్రం, సికింద్రాబాద్​లోని రేతిఫైల్ బస్​పాస్ కౌంటర్​లలో యూపీఐ, క్యూఆర్ కోడ్ సేవలు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభమయ్యాయి. ఈ సేవలను ప్రారంభమైన టైమ్ లో ప్రయాణికుల నుంచి అభిప్రాయలు అడిగారు సజ్జనార్. యూపీఐ టెల్లింపులపై అభిప్రాయాలు, సూచనలు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కోరారు. దీనిపై ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన వచ్చింది.