Young Boy Died In An Accident In Tandur In Vikarabad: తెలంగాణలో (Telangana) ఒకే రోజు రెండు తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఓ 8 ఏళ్ల బాలుడు లారీ కింద పడి ప్రాణాలు కోల్పోగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ (Vikarabad) జిల్లా తాండూర్ (Tandur) పట్టణంలో ఓ బాలుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఉదయం తండ్రి తన కుమార్తె, కుమారున్ని స్కూల్ వద్ద దిగబెట్టేందుకు బైక్‌పై తీసుకెళ్లాడు. అదే సమయంలో ఓ లారీ వెనక్కు తీసే క్రమంలో అక్కడికి రాగానే వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో కుమారుడు జనార్థన్ (8) లారీ కింద పడి నుజ్జై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు హన్మంతు, వరలక్ష్మీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. 


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హన్మంతు, వరలక్ష్మి కుటుంబం అనంతపురం జిల్లా గుత్తి మండలం అనగానిదొడ్డికి చెందిన వారు. ఉపాధి కోసం వీరు ఇక్కడికి వలస వచ్చి గోపన్పల్లి సమీపంలోని నజీర్‌సేట్ అనే వ్యాపారి పాలిషింగ్ యూనిట్‌లో కూలీలుగా పని చేస్తున్నారు. శనివారం ఉదయం హన్మంతు తన పిల్లలను స్కూలు వద్ద దించే క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది.


గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు


అటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో (Kothagudem District) గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీకి చెందిన హరికృష్ణ (13) గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న బాలుడికి శనివారం పాఠశాలలోనే ఛాతీ నొప్పి రాగా టీచర్లు, సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, బాలుడికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.


Also Read: Road Accident: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం - వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాల్లో 9 మంది మృతి