తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో మరో 7 ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. 62కి చేరింది. అయితే మెుత్తం ఒమిక్రాన్ బాధితుల్లో.. 46 మంది టీకాలు తీసుకోలేదు. ఇందులోనూ.. ట్రావెల్ హిస్టరీ లేని ముగ్గురికి ఒమిక్రాన్ నిర్ధరాణ అయింది. అయితే మెుదట్లో.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలోనే.. ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. అయితే ఇప్పుడు ఎలాంటి ప్రయాణాలు లేని వాళ్లలో కూడా.. వేరియంట్ ను గుర్తించారు.


మరోవైపు ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలు విధించింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించింది. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి క్రిస్మిస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం తెలిపింది.  ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. 


జనవరి 2 వరకూ ఆంక్షలు 





ఒమిక్రాన్‌ విస్తరిస్తోన్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కోవిడ్‌ ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని విపత్తు నిర్వహణచట్టం కింద ఆంక్షలు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించినట్లు పేర్కొంది. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున్న జనం హాజరయ్యే కార్యక్రమాలకు అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం పాటించాలని కోరింది. ప్రతీ ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది. కార్యక్రమాల ప్రవేశద్వారాల వద్ద థర్మల్‌ స్కానర్లు ఏర్పాటుచేయాలని, వ్యక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది.  బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు ఆంక్షల ఉత్తర్వులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించింది. సీఎస్ సోమేశ్‌ కుమార్‌ గతంలోనే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 





 

ఇంకోవైపు తమిళనాడులో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో మరో 11 కేసులు నమోదయ్యాయి.  దీంతో మొత్తంగా తమిళనాడులో ఒమిక్రాన్ కేసులు 45 వరకు ఉన్నాయి. తమిళనాడులో  ఐదు రోజుల క్రితం  ఒక్క రోజే  33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.  ఒమిక్రాన్ సోకిన వారిలో అత్యధికులు విదేశాల నుంచి వస్తున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల ఎయిర్ పోర్టుల్లో దిగి తమిళనాడుకు వస్తున్నారు. ఒమిక్రాన్ బారిన పడుతున్న వారిలో అందరూ రెడు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారే.   కొత్తగా నమోదైన  కేసుల్లో పెద్దగా లక్షణాలతో బాధపడుతున్నవారు లేరని.. ఒకరిద్దరిలో మాత్రం స్వల్పంగా గొంతునొప్పి, వికారం వంటి లక్షణాలు కనిపించాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.  అనుమానితుల శాంపిల్స్‌ను ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపుతున్నారు.